దొడ్డిదారిలో గెలిచిన్రు

దొడ్డిదారిలో గెలిచిన్రు

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్​ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దొడ్డిదారిలో గెలిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​మండిపడ్డారు. మేయర్, చైర్​పర్సన్​ ఎన్నిక కోసం నిబంధనలను తుంగలో తొక్కిన టీఆర్ఎస్ నేతలు.. వంద మున్సిపాల్టీలు గెలిచామని గొప్పగా చెప్పుకుంటోందని, అసలు ఇది ఓ గెలుపేనా అని ప్రశ్నించారు. ఇలాంటి గెలుపు కోసం ఇంతగా దిగజారాలా? అని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను నిలదీశారు. తుక్కుగూడలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినా ఎక్స్​ అఫీషియో ఓట్లతో చైర్మన్​ను గెలిపించుకుని ప్రజల తీర్పును అధికార పార్టీ అవమానపరిచిందని​ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ తీరుతో రాజకీయాలంటేనే జనం అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలంటేనే బూటకంగా మారాయని, ఓటర్ల జాబితా మొదలుకుని వార్డుల విభజన, ఎలక్షన్​ నోటిఫికేషన్ ఇవ్వడం, దొంగ ఓట్లు వేయించుకోవడం ఇలా రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని కేసీఆర్, కేటీఆర్ అమలు చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. గురువారం లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు రాజ్ భవన్​లో గవర్నర్ తమిళిసైని కలిసి తుక్కుగూడ మున్సిపాల్టీని టీఆర్ఎస్ దక్కించుకున్న తీరు, ఎంపీ కేశవరావు రూల్స్​కు విరుద్ధంగా ఓటు వేయడంపై ఫిర్యాదు చేశారు. గవర్నర్​ను కలిసిన వారిలో గరికపాటి మోహన్ రావు, రాంచందర్ రావు, ఇంద్రసేనారెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, వీరేందర్ గౌడ్, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. గవర్నర్​లో భేటీ తర్వాత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.

రాజకీయ, న్యాయ పోరాటానికి సిద్ధం

దేశంలో ఇలాంటి ఎన్నికలను ఎక్కడా చూడలేదని లక్ష్మణ్​ అన్నారు. కోట్లు ఖర్చు పెట్టి, విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసి, పోలీసులు, ఎన్నికల సంఘాన్ని వాడుకుని, నైతిక విలువలను తుంగలో తొక్కి టీఆర్ఎస్ గెలిచిన తీరుకు సిగ్గుపడుతున్నామన్నారు. తుక్కుగూడలో టీఆర్ఎస్ వ్యవహరించినట్లే, తాము వ్యవహరించి ఉంటే రాష్ట్రంలో అధికార పార్టీకి ఒక్క మున్సిపాల్టీ దక్కేది కాదన్నారు. ఏపీకి కేటాయించబడిన ఎంపీ కేకేతో తుక్కుగూడలో ఎక్స్ అఫీషియోగా ఎలా ఓటు వేయిస్తారన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 360 మందికిపైగా ఎంపీలు, వేల మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని, వారందరినీ ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేయించి ఓట్లు వేయిస్తే టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. కేకేపై చర్యలు తీసుకోవాలని శనివారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును కలిసి ఫిర్యాదు చేస్తామని లక్ష్మణ్ చెప్పారు. అనైతికంగా ఓటు వేసిన కేకేను వదిలేది లేదని, ఈ అంశంపై రాజకీయ, న్యాయ పోరాటాలకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.