- కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
- అశోక్‌నగర్ శివాలయాన్ని పున:నిర్మించాలి
- బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి ఉమామహేశ్వర్‌రెడ్డి
నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌లో బడి నిర్మించడం కోసం.. పురాతన శివాలయన్ని ధ్వంసం చేయడం ఏంటని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి ఉమామహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. శివాలయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి, స్థానిక నాయకుల ధర్మాగ్రహ దీక్షకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాకతీయులు నిర్మించిన శివాలయాన్ని కూల్చిన ఘటనపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుడులను కాపాడేందుకు బీజేపీ ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. 8వందల సంవత్సరాల చరిత్ర గల అశోక్‌నగర్ శివాలయం ఎండో మెంట్ పరిధిలో లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. పురాతన ఆలయాన్ని గుర్తించలేని స్థితిలో పురావస్తు శాఖ ఉందా అని ప్రశ్నించారు.
శివాలయానికి 15 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గుడి నిర్మించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో చందాలు వేసుకుని నిర్మిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసం కొంత మంది మంత్రులు శ్రీరాముడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాష్ర్టంలో ఓ వైపు హిందువులపై దాడులు చేస్తూనే.. మరో వైపు 27 నెలల కాలంలో 13 గుళ్లను ధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అశోక్‌నగర్ శివాలయం కూల్చిన చోటే నిర్మించకపోతే.. తామే శంకుస్థాపన చేసి నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, నాయకుల గూడూరు సందీప్, మనీష్ పాల్గొన్నారు.
