దేవుడి భూముల జోలికొస్తే ఊరుకోం : నందీశ్వర్​ గౌడ్

దేవుడి భూముల జోలికొస్తే ఊరుకోం : నందీశ్వర్​ గౌడ్

 పటాన్ చెరు, వెలుగు:  దేవుడి భూముల జోలికొస్తే ఊరుకోమని, కబ్జాదారుల తాటతీస్తామని బీజేపీ నేత,  మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని కోదండ రామాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోదండ రామాలయానికి చెందిన 7.19 ఎకరాల దేవుడి మాన్యం భూమిని ఆక్రమించి ఏపీఆర్ గ్రూప్​కు, ఆర్ఎంసీ ప్లాంట్ కోసం లీజుకివ్వడం దుర్మార్గమన్నారు.

వందల కోట్ల విలువైన భూములను కాజేయడానికి ప్రయత్నించడమే కాకుండా లీజు సొమ్మును సైతం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీసుకుంటూ అక్రమ దందా చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూముల అవకతవకలను ప్రశ్నించిన కోదండ రామాలయం ట్రస్ట్ చైర్మన్ మనోహర్ రెడ్డిని బెదిరించి దందా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

వెంటనే రామాలయం భూముల్లో నడిపిస్తున్న ఆర్ఎంసీ ప్లాంట్ ఖాళీ చేయాలని లేని పక్షంలో పటాన్ చెరు నడిబొడ్డున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.