- జనావాసాల్లోకి ఏనుగు వస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు : ఎమ్మెల్యే పాల్వాయి
హైదరాబాద్, వెలుగు : అటవీ శాఖ అధికారుల వైఫల్యం వల్లే ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు రైతులు మరణించారని బీజేపీ నేత, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఆరోపించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. జనావాసాల్లోకి ఏనుగు వస్తే ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు చనిపోయినా కలెక్టర్, ఎస్పీ కూడా పట్టించుకోలేదని ఆరోపించారు.
గతంలో పెద్దపులి దాడిలోనూ పలువురు మరణించారని ఆయన గుర్తుచేశారు. బాధిత కుటుంబాలకు మంత్రి కొండా సురేఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించారని, కానీ మహారాష్ట్రలో రూ.20 లక్షలు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.20 లక్షలతో పాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాగా, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం డీజీపీకి తెలియకుండానే జరిగిందా.. అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అభద్రతా భావం మొదలైందని, కేబినెట్ మంత్రులు ఎవరూ ఆయనకు సహకరించడం లేదన్నారు.