విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న విద్యామంత్రి

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న విద్యామంత్రి

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎంఐఎం కోటాలోనే మంత్రి పదవి వచ్చిందని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాను భ్రష్టు పట్టించే విధంగా పటోళ్లు, పట్నం కుటుంబాలు దశాబ్దాలుగా ఏలుతున్నారని ఆయన విమర్శించారు. అధికారం కోసం ఎంఐఎం పార్టీ నేతలతో అంతర్గత ఒప్పందం చేసుకుని విద్యాశాఖ మంత్రిగా పదవి పొందారని ఆరోపణలు చేశారు. మహేశ్వరం నుండి మన్సాన్ పల్లి వెళ్లే రహదారిలో ఉన్న విప్రో కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ రోజు మండల శాఖ బీజేవైఎం  ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ సహా వసతి గృహాల్లో కలుషిత ఆహారం తిని అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కందుకూరు మండలంలో సైతం ఫార్మా కంపెనీలకు కోట్లా రూపాయల విలువైన భూములు ధారాదత్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఎంఐఎంకి తొత్తుగా మారరని అందెల శ్రీరాములు విమర్శించారు. కంపెనీల పేరుతో భూములు దోచుకుని నాడు, నేడు దళితులు, పేదలను మోసం చేస్తున్నారని మంత్రి సబితా రెడ్డిపై విమర్శలు గుప్పించారు. స్థానిక సమస్యలపై అవగాహనలేని ఎమ్మెల్యే సబితారెడ్డిని ఈసారి ఇంటికి పంపటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు యాదీష్, బీజేపీ, బీజేవైఎం నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.