ఆ కంపు భరించలేకపోతున్నాం..హుస్సేన్ సాగర్లో మురుగు కలపకుండా ఆపండి: బీజేపీ నేత మాధవీలత

ఆ కంపు భరించలేకపోతున్నాం..హుస్సేన్ సాగర్లో మురుగు కలపకుండా ఆపండి: బీజేపీ నేత మాధవీలత
  • అక్కడే నిమజ్జనాలు చేస్తాం బీజేపీ నేత మాధవీలత  

ఖైరతాబాద్, వెలుగు: హుస్సేన్​సాగర్​లో గణేశ్​నిమజ్జనంతో ఏ సమస్యా ఉండదని బీజేపీ లీడర్, భాగ్యనగర్ గణేశ్​ఉత్సవ సమితి మెంబర్​మాధవీలత అన్నారు. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 

‘హుస్సేన్​సాగర్​లో డ్రైనేజీల ద్వారా కలుస్తున్న మల, మూత్ర విసర్జనను ముందు ఆపండి. ఆ కంపు భరించలేకున్నాం. ఎప్పటిలాగే  హిందూ సంప్రదాయం ప్రకారం భక్తులు వినాయకుడిని హుస్సేన్​సాగర్​లోనే నిమజ్జనం చేస్తారు. దానికి  సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. లేకుంటే ప్రత్యామ్నాయ స్థలం చూపండి. 

ఆంక్షలు అంటూ అడ్డుకుంటే విగ్రహాలు మండపాల వద్దే ఉంటాయి. అక్కడే కొత్తగా వెలసిన దేవాలయాలుగా పూజలు చేస్తాం’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భాగ్యనగర్​గణేశ్​ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్​రెడ్డి మాట్లాడుతూ రెండేండ్లుగా ప్రభుత్వం హైకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ నిమజ్జనానికి చర్యలు తీసుకుంటోందన్నారు.

హైకోర్టు ఉత్తర్వులపై  అనేక వదంతులు వస్తున్నాయని, 2021 హైకోర్టు ఆదేశాల ప్రకారం పీఓపీ(ప్లాస్టర్​ఆఫ్​ప్యారిస్) విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చన్నారు. కాలుష్యకారకులకు తాము కూడా వ్యతిరేకమేనని చెప్పారు.

 అయితే మార్పునకు కొంత సమయం పడుతుందన్నారు. ఎన్టీఆర్​మార్గ్​, నెక్లెస్​రోడ్​లో నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.  2022, 2023లో మాదిరిగా గణేశ్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. శాంతియుతంగా విగ్రహాలను నిమజ్జనానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.