చిన్నారి ఘటన నన్ను కలిచి వేసింది

చిన్నారి  ఘటన నన్ను కలిచి వేసింది

ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం వల్ల చిన్నారి మృతి  చెందిన ఘటన తనను కలిచి వేసిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  అన్నారు. నిండు నూరేళ్ళు జీవించాల్సిన చిన్నారి పోలీసుల నియంత ధోరణికి బలి అయ్యాడని అన్నారు. చిన్నారి మృతికి కచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, పోలీసులకు కూడా కుటుంబాలు ఉంటాయన్న విషయం మర్చిపోయి విధులు నిర్వహిస్తున్నారని డీకే అరుణ అన్నారు. తల్లి తండ్రుల కడుపు కోతకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేసారు. మంగళవారం యాదాద్రి జిల్లా వంగపల్లి నుంచి చికిత్స కోసం హైదరాబాద్ నగరంలో నిలోఫర్ ఆసుపత్రికి చిన్నారిని తీసుకొని వస్తున్న ఓ కుటుంబం కారును పోలీసులు చలాన్ ఉందంటూ నిలిపి వారితో డబ్బు కట్టించుకునే వరకు వదలక పోవడంతో, మార్గ మధ్యంలోనే చిన్నారి మృతి చెందడం తనను వ్యక్తిగతంగా కలిచి వేసిందన్నారు.