
తెలంగాణకు ప్రధాని మోడీ ఎందుకు శత్రువు అయ్యారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మాటలను కేసీఆర్ అవమానపరిచారని, కేసీఆర్ లాగా అబద్దాలు చెప్పడం మోడీకి రాదన్నారు. రాజకీయాలపై తప్పా సంక్షేమం పై కేసీఆర్ కు సోయి ఉండదని అరుణ విమర్శించారు. మోడీని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదన్న ఆమె... ముఖ్యమంత్రిని గద్దె దించాలని తెలంగాణ ప్రజలు చూస్తున్నారన్నారు. అది చూసి తట్టుకోలేక కేసీఆర్ బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను మోడీ అడ్డుకుంటున్నారనడం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించలేదని డీకే అరుణ ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో ఎలా దోచుకుంటున్నారో అందరికీ తెలుసని విమర్శలు చేశారు. మూడేండ్లలో పూర్తి చేస్తానని చెప్పి ఆరేండ్లయినా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు.
లక్షల కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల పాలు అయ్యిందని, కమీషన్లు మింగుతూ తెలంగాణను అప్పుల పాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని..సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతామన్నారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాకపోతే సీఎం కుర్చీ నుండి దిగిపోవాలన్నారు.