‘గాంధీ’లో జ‌న‌రేట‌ర్ వెయ్యడానికి డీజిల్ లేదనడం దారుణం

‘గాంధీ’లో జ‌న‌రేట‌ర్ వెయ్యడానికి డీజిల్ లేదనడం దారుణం

హైద‌రాబాద్: కరోనా నియంత్ర‌ణ విష‌యంలో ప్ర‌‌భుత్వం ఎలాంటి‌ ప్రణాళిక లేకుండా పాలన చేస్తోంద‌ని రాష్ట్ర బీజేపీ మాజీ అధ్య‌క్షుడు ఇంద్ర‌సేనా రెడ్డి అన్నారు. కరోనా మరణాల అనంతరం మృతదేహాలు తారుమారు అవ్వడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమ‌ని చెప్పారు. శ‌నివారం జూమ్ యాప్ ద్వారా ప్రెస్ మీట్ నిర్వ‌హించిన ఆయ‌న‌.. కరోనా రోగులు ఎవరిని కలవాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియ‌ని అయోమయంలో ఉన్నార‌న్నారు.

కరోనా వ్యాధి తీవ్ర‌త‌ను గుర్తించకుండా, ప్రజలకు కనీస అవగాహన కల్పించకుండా ప్రజల ప్రాణాలతో ప్ర‌భుత్వం చెలగాటమాడుతుంద‌ని ఇంద్ర సేనా రెడ్డి విమ‌ర్శించారు. క‌రోనా అనుమానం ఉన్న ప్రజలు-ఎక్కడ టెస్టులు చేయించుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారని , ఇతర వ్యాధులు ఉన్న వారు హాస్పిటల్ కి వెళ్తే కరొనా టెస్టు రిపోర్ట్ అడుగుతున్నారన్నారు. గాంధీ హాస్పిటల్ లో కరెంట్ పోతే కనీసం జనరేటర్ వెయ్యడానికి డీజిల్ లేదనడం దారుణమ‌ని చెప్పారు. వందల కోట్లతో సెక్రటేరియట్ కడుతున్నారు.. కానీ కరోనా మృతదేహాలను కాల్చడానికి ఎలక్ట్రికల్ మిషన్స్ లేకపోవడం దురదృష్టకర‌మ‌ని అన్నారు.

కరోనా టెస్టులు ఎక్కడెక్కడ చేస్తున్నారో–ప్రజలకు ఎడ్యుకేట్ చెయ్యాలని ఇంద్ర‌సేనా రెడ్డి అన్నారు. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందని, పనిలేక ఆత్మచేసుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ఆయ‌న అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే 50వేల మంది ఉద్యోగులు ఇళ్లుగడువలేక ఇబ్బందులు పడుతున్నారు.

BJP leader Indrasena Reddy press meet on Government negligence in corona issue