సబ్సిడీ ఎరువులు అందట్లే: బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి

సబ్సిడీ ఎరువులు అందట్లే: బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి

హైదరాబాద్, వెలుగు: దేశంలోని రైతులందరికీ మేలు జరిగేలా కేంద్రం ఎరువులపై సబ్సిడీ ఇస్తుంటే.. తెలంగాణలో ఆ సబ్సిడీ అందకుండా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు.  రాష్ట్రంలో ప్రస్తుతం ఎరువుల కొరత తీవ్రంగా ఉందన్నారు.  గతంలో 50 లక్షల మంది రైతులకు 24 లక్షల టన్నుల ఎరువులు ఫ్రీగా ఇస్తామని కేసీఆర్ దగా చేసిండన్నారు. ఆదివారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడారు.  మార్క్ ఫెడ్ లో ఉన్న ఎరువులను రైతులకు 24 గంటల్లోగా సర్కార్​ అందించాలని డిమాండ్​ చేశారు. 

లేకుంటే బీజేపీ  ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్ ఆఫీసులను ముట్టడించి రైతులకు ఎరువులు దక్కేలా చేస్తామని ఆయన హెచ్చరించారు.  అబ్‌‌ కీ బార్‌‌.. కిసాన్‌‌ సర్కార్‌‌ నినాదంతో  రాష్ట్రాలన్నీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న  సీఎం  కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం ‘బీజ్ సే..  బజార్ తక్’ నినాదంతో ముందుకెళ్తోందని,  రైతులకు విత్తనం నుంచి పంట అమ్ముకునేంతవరకు బాధ్యత తీసుకుంటోందన్నారు.  గతంలో మూతపడిన 5 ఎరువుల కర్మాగారాలను కేంద్ర ప్రభుత్వం తిరిగి ​ప్రారంభించిందని గుర్తు చేశారు.  కాంగ్రెస్-, బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఒకేతాను ముక్కలని,  బీజేపీని బద్నాం చేయాలనే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.