
యాదాద్రి, వెలుగు:భువనగిరి నుంచే సీఎం కేసీఆర్ పతనం మొదలవుతుందని బీజేపీ లీడర్ జిట్టా బాలకృష్ణారెడ్డి చెప్పారు. ప్రజలకు భయపడి ఫాం హౌజ్‌లో దాక్కుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భువనగిరి నుంచి ఉద్యమం ప్రారంభించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న ఉద్యమకారులను అరెస్ట్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేండ్ల నుంచి సీఎంగా కొనసాగుతున్న కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఇంటికో ఉద్యోగం, మూసీ ప్రక్షాళన, దళితులకు మూడెకరాల భూమి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణకు ఏమీ చేయనోడు... దేశానికి ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లు చేస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. యాదాద్రి జిల్లాలో జరిగిన అభివృద్ధిపై భువనగిరి అంబేద్కర్ చౌరస్తా వద్ద చర్చకు సిద్ధమేనా ? అని సవాల్ విసిరారు. అనంతరం పలువురు కళాకారుల ఆటపాటలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఏశాల అశోక్, కాచరాజు జయప్రకాశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.