
తెలంగాణ ప్రజల తీర్పును ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవించటం లేదని, తన కూతురు, బంధువు ఓడిపోవటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని కేసీఆర్ అనటం అన్యాయమన్నారు. కేంద్రంలో, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాలు లేకుంటే కాళేశ్వరం ప్రాజక్టు సాధ్యమయేదా? అని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టుకు అటవీ అనుమతులు ఇచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం అని, ఇదే విషయాన్ని అప్పుడు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్, హరీష్ రావులు మోదీని కీర్తించారని.. ఇప్పుడు ఆయన్ను ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవటం బాధాకరమని లక్ష్మణ్ అన్నారు.
పదవుల కోసం రాజీపడిన చరిత్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ ది పదవుల కోసం రాజీపడిన చరిత్ర అని లక్ష్మణ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత సీఎం ప్రస్తుతం ప్రతిపక్షాలను గౌరవించలేని స్థితిలో ఉన్నారన్నారు. తమ పార్టీ తెలంగాణ ప్రజల అవసరాల కోసం పనిచేస్తోందని.. టీఆర్ఎస్ మాదిరి ఒకే కుటుంబం కోసం కాదని లక్ష్మణ్ అన్నారు.
హరీష్ రావు ఎక్కడ?
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్రం చేసిందేమిటో కేంద్రమంత్రుల చుట్టూ తిరిగిన హరీష్ రావును అడిగితే తెలస్తుందని లక్ష్మణ్ అన్నారు. ప్రసుతం అతను ఎక్కడ కన్పించటం లేదని అన్నారు.కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉండి.. కేసీఆర్ రామగుండం ఎరువుల కర్మాగారం కోసం కనీస ప్రయత్నం చేయలేదని అన్నారు.
క్యాబినెట్ మీటింగ్ అందుకే..
ప్రభుత్వ ఏర్పడిన 6 నెలల తర్వాత కేబినేట్ మీటింగ్ ఏర్పాటు చేసి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా మిగతా అంశాలను ప్రస్తావించడం కరెక్టు కాదన్నారు. నిరుద్యోగం, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఆర్టీసీని ఆదుకోనేందుకు చర్యలు ఇవేవీ కనీసం క్యాబినెట్ లో చర్చించలేదన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలన్న ఆకాంక్ష ముఖ్యమంత్రికి లేదని లక్ష్మణ్ అన్నారు.
ప్రస్తుతానికి కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు రాష్ట్రానికి అవసరం లేదన్నారు. చారిత్రాత్మక నేపథ్యమున్న శాససభను మార్చటానికి తాము వ్యతిరేకమని లక్ష్మణ్ అన్నారు. 30 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసమే కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లుందని ఆయన అన్నారు.
కిషన్ రెడ్డి కరెక్టె అన్నాడు.
హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని గతంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు లక్ష్మణ్. హైదరాబాద్ ఇప్పటికీ భద్రత పరంగా సేఫ్ కాదన్నారు. కాలం చెల్లిన వీసాలున్న వారు హైదరాబాద్ లో వేల మంది ఉన్నారన్నారు. ఉగ్రవాదానికి, మతానికి మడిపెట్టడం సరికాదన్నారు. మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్ధీన్ పై ప్రేమ ఉంటే కేసీఆర్ నెత్తిన పెట్టుకోవాలని లక్ష్మణ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ను రావొద్దని మేము చెప్పమని లక్ష్మణ్ అన్నారు.