‘కేటీఆర్… రాజకీయాలు ఆపి ముందు రాజ్యాంగం చదువు’

‘కేటీఆర్… రాజకీయాలు ఆపి ముందు రాజ్యాంగం చదువు’

దేశంలో చిన్నా, పెద్ద పార్టీలు తప్ప జాతీయ పార్టీలనేవి లేవని, దక్షిణాదిలో అస్సలు ఉనికే లేని బీజేపీని జాతీయపార్టీగా చెప్పలేమని గురువారం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు ఆ పార్టీ నేత కృష్ణ సాగర్ రావు. శుక్రవారం పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, కేంద్ర పన్నుల మీద ట్యూషన్ చెప్పించుకోవాలని అన్నారు.

“కేటీఆర్ తనకు తాను ఏదో మేధావి అనుకుంటున్నాడు. రాజకీయాలు ఆపి ముందు రాజ్యాంగం చదవాలన్నారు” కృష్ణ సాగర్ రావు.అవగాహన లేకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని, బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం బతికేదే కేంద్రం ప్రభుత్వ నిధుల మీదని, రాష్ట్రానికి  కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన అన్నారు. కేంద్రం 115 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ కు ఇస్తే.. ఆ కేటాయించిన నిధులన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. బీజేపీ జాతీయ పార్టీ కాదని చెబుతున్న కేటీఆర్.. తమ పార్టీ ఏమైనా TRS పార్టీ అనుకుంటున్నావా…? అని ప్రశ్నించారు కృష్ణ సాగర్.

2017లో 1386 కోట్ల రాబడి లో తెలంగాణ ఉందని దొంగ లెక్కలు చెప్పి…చివరకు తెలంగాణ  199 కోట్ల మిగులు బడ్జెట్ అని టీఆర్ఎస్ ప్రభుత్వం తేల్చిందన్నారు. 2018 నాటికి మాత్రం మైనస్ అని చెప్పి  తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేశారన్నారు.

షూట్, బూటు వేసుకోనీ మాట్లాడడం కాదని, ప్రెస్ మీట్ లు పెట్టి సోది చెప్పడం ఆపాలని కేటీఆర్, కెసిఆర్ లకు కృష్ణ సాగర్ సూచించారు .కేటీఆర్ మాట్లాడితే చప్పట్లు కొట్టే వాళ్ళు ఉండొచ్చు..కానీ ప్రజలు, మేధావులు అంతా అతను ఏం మాట్లాడుతున్నాడో గమనిస్తూనే ఉంటారన్నారు.