ఇంటర్ సమస్యను దృష్టి మరల్చేందుకే అంబర్ పేట్ గొడవ

ఇంటర్ సమస్యను దృష్టి మరల్చేందుకే అంబర్ పేట్ గొడవ

ఇంటర్ తప్పులను కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే అంబర్ పేటలో గొడవలు పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. లక్ష్మణ్‌ నేతృత్వంలో బీజేపీ నాయకులు దత్తాత్రేయ, కిషన్‌ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డిని కలిశారు. ప్రభుత్వ డబ్బుతో నష్టపరిహారం పొందిన తర్వాత మళ్లీ మజ్లిస్‌ నాయకులు, బయటి వ్యక్తులతో కలిసి అదే స్థలంలో ప్రార్ధన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఫ్లై ఓవర్‌ నిర్మించడానికి కూల్చివేసిన స్థలంలో మళ్లీ గుంపులుగా నమాజ్‌ చేస్తే స్థానిక అంబర్‌ పేట్‌ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు.

ప్రభుత్వ స్థలంలో షెడ్‌ వేసి ప్రార్ధన చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీని వదిలేసి, కాపాడటానికి వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు బేడీలు వేసి అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యను దృష్టి మరల్చడం కోసమే మజ్లిస్‌ సహకారంతో ఇలా చేశారని ఆరోపించారు.

పోలీసులది పక్షపాత ధోరణి: దత్తాత్రేయ

శాంతియుతంగా ఉన్నవాతావరణం చెడగొట్టే యత్నం జరుగుతోందని బీజేపీ ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. ఫ్లైఓవర్‌కు అడ్డం పడేవిధంగా అక్రమ నిర్మాణం చేయబోయిన మజ్లిస్ ఎమ్మెల్యేల మీద పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలం మీద వక్ఫ్‌బోర్డు పేరు పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలకు బేడీలు వేస్తారా.. ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. అరాచక శక్తులకు స్వేచ్ఛ ఇచ్చి పోలీసులు పక్షపాతధోరణి అవలంబిస్తోన్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు.