విద్యార్ధుల ఆత్మహత్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాం: లక్ష్మణ్

విద్యార్ధుల ఆత్మహత్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాం: లక్ష్మణ్

ఢిల్లీ: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య లపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.విద్యార్థుల ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపించాలని రాష్ట్రపతి కి విజ్ఞప్తి చేశామని, తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని అన్నారు.

ఈ రోజు మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్ ఈ విషయాలను వెల్లడించారు. విద్యార్థుల ఆత్మహత్యలు కాదు ..ఇవి రాష్ట్ర ప్రభుత్వ హత్యలని అన్నారు.  27 మంది విద్యార్థులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలని పట్టించుకోలేదని అన్నారు. ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

విద్యార్థుల ఆత్మహత్య కు నిరసనగా బిజెపి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోందని చెప్పారు లక్ష్మణ్. రిజల్ట్స్ లో అవకతవకలకు కారణమైన  గ్లోబరీనా  సంస్థపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, మళ్లీ ఆ సంస్థకే రీ వెరిఫికేషన్ ప్రాజెక్టు ఇవ్వడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ పోరాటం జరిగింది నిధులు నియామకాల కోసమని,  రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు  ఉద్యోగాలకై ఎదురుచూస్తూ ఉన్నారన్నారు. గత ఐదు సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదన్నారు.