విద్యాసంస్థలు వ్యాపార సంస్థలుగా మారాయి: లక్ష్మణ్

విద్యాసంస్థలు వ్యాపార సంస్థలుగా మారాయి: లక్ష్మణ్

విద్యాసంస్థలు వ్యాపార సంస్థలుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ అన్నారు. అబిడ్స్ లోని మెదడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజు “కార్పొరేట్, ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఫీజుల విధానం” పై బీజేవైఏం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే కార్పొరేట్ విద్యాసంస్థలు ఉండవనుకొన్నామని, కాని అధిక ఫీజులు తీసుకొనే నగరాల్లో రాజధాని హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికంగా ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ విద్యాసంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని లక్ష్మణ్ అన్నారు. మరోవైపు ఆ పాఠశాలలు కూడా ఫీజుల నియంత్రణపై ఎలాంటి చట్టాలు పాటించడం లేదని అన్నారు. అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు దాటకూడదని నిబంధనలున్నా.. వాటిని ఆచరించడం లేదన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరుతో   హైదరాబాద్ స్కూళ్లు 50 నుండి 70%లాభాలు గడిస్తున్నారని అన్నారు. ఓక్రిడ్జ్ స్కూలును 1600 కోట్లకు అమ్మారంటే విద్యావ్యాపారం ఎలా ఉందో అర్దం చేసుకోవాలని లక్ష్మణ్ తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో  క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ప్రభుత్వం ఆసక్తి చూపట్టడం లేదని, దీంతో రాష్ట్రంలో నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడనున్నాయని తెలిపారు. దీంతో మారుమూల గ్రామాల్లో ఉండే విద్యార్ధులు చదువు కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందన్నారు. ఇప్పటికే  రాష్ట్రంలో నిరక్షరాస్యత 34% వరకు ఉందన్నారు. పేద, మధ్య తరగతికి విద్య అందుబాటులో ఉండాలంటే ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు తగ్గించాలని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకుంటే  ఫీజుల నియంత్రణపై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఫీజులు తగ్గిస్తారా?  లేదా ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా ? తేల్చుకోవాలని లక్ష్మణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.