జూన్​లో రాష్ట్రంలో ఊహించని రాజకీయ మార్పులు: లక్ష్మణ్

జూన్​లో రాష్ట్రంలో ఊహించని రాజకీయ మార్పులు: లక్ష్మణ్

హైదరాబాద్/నల్గొండ, వెలుగు: జూన్ 4 తర్వాత రాష్ట్రంలో ఎవరూ ఊహించని రాజకీయ మార్పులు జరుగుతాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం హైదరాబాద్​లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో, నల్గొండలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపిస్తే కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వం వచ్చేది లేదు సచ్చేది లేదని, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదని ఎద్దేవా చేశారు. శ్యామ్ పిట్రోడా140 కోట్ల భారతీయులపైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని.. వాటిని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇంతవరకు ఖండించలేదన్నారు.

 సీఎం రేవంత్ రెడ్డి రక్తంలో కాంగ్రెస్ లేదని, ఏదో అదృష్టవశాత్తు ఆయన సీఎం అయ్యారని తెలిపారు. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తదని రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచిందే తప్ప ఎక్కడా రద్దు చేయలేదన్నారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు ఏకమయ్యారన్నారు. అయినా పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు సైదిరెడ్డి, బూర నర్సయ్యగౌడ్ కచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎన్వీ సుభాష్​, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఎన్.రామచందర్రావు తదితరులు ఉన్నారు.