తెలంగాణ వచ్చింది కేవలం కేసీఆర్ ఫ్యామిలీ కోసమే

తెలంగాణ వచ్చింది కేవలం కేసీఆర్ ఫ్యామిలీ కోసమే

కేసీఆర్ సొంత ఛానల్ పెట్టుకొని జైజై అనిపించుకున్నాడని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు విమర్శించారు. ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గంలో "ప్రజా గోస బీజేపీ భరోసా" కార్యక్రమం 2వ రోజు నిర్వహించారు. ఇందులో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం పొన్నల గ్రామంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మురళీధర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో చాలా మందికి డబుల్ బెడ్ రూమ్ లు వచ్చాయి అనుకుంటున్నారు.. కానీ ఎవరికీ రాలేదని తెలిపారు.

సీఎం కేసీఆర్ ఫ్యామిలీ లాగా మోడీ ఫ్యామిలీ రాజకీయాలలో లేరని మురళీధర్ రావు ఆరోపించారు. ఆయన లాగా ఏ సీఎం ఇంత వరకు ఇలా బూతులు మాట్లాడలేదన్నారు. కేసీఆర్ వల్ల సిద్దిపేట పరువు పోతుందని ఎద్దేవ చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం సిద్దిపేటలోనే అందరికి డబుల్ బెడ్ రూమ్ లు రాకపోతే మరి వేరే ప్రాంతంలో ఎలా వస్తాయని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చింది కేవలం కేసీఆర్ ఫ్యామిలీ కోసమే అని ఫైర్ అయ్యారు.

ఎస్టీల మీద కేసీఆర్ కు ప్రేమ లేదని మురళీధర్ రావు విమర్శించారు. ఆయనకు రాత్రి పగలు మొత్తం ఓట్లు కావాలి..అంతే తప్ప వేరే ఆలోచన లేదన్నారు. బీజేపీ వాళ్లు హిందూ దేవుళ్ళను పూజిస్తే మతోన్మాదులు అంటున్నావ్ మరి నీవు ఓవైసీతో తిరిగితే నిన్ను ఏమనాలి అని ప్రశ్నించారు. ఎంతో మంది కొత్త నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు.. నీవు కూడా అంతే అని మురళీధర్ రావు చెప్పారు.