- భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు
- ములుగు జిల్లా నర్సాపూర్ వద్ద ప్రమాదం
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: సొంతూరిలో ఓటు వేసి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. వెంకటాపూర్ ఎస్ఐ చల్లా రాజు తెలిపిన ప్రకారం.. భూపాలపల్లి సింగరేణి ఉద్యోగి అల్వాల దేవేందర్(38), అపర్ణ(33), దంపతులకు ఇద్దరు పిల్లలు. కాగా.. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం తమ సొంతూరు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాలలో ఓటు వేసేందుకు కారులో వెళ్లారు.
ఓటు వేసిన తర్వాత తిరిగి వెళ్తుండగా సాయంత్రం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ శివారులో కారు అదుపు తప్పి బోల్తా పడింది. అపర్ణ స్పాట్ లో చనిపోగా, దేవేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
