
- హైకోర్టు సీజేకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: అవినీతి, అక్రమాలకు పాల్పడేవారికి, పన్ను ఎగవేతదారులకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందని, దానిని వెంటనే సీజ్ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరారు. సీబీఐ విచారణకు హజరయ్యేముందు, ఆ తర్వాత.. ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్‌కే వచ్చారని, తాజాగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా ఈడీ నోటీసు అందుకున్న తర్వాత, విచారణకు హజరయ్యేముందు కూడా ప్రగతి భవన్‌కే వచ్చారని ఆయన ఆరోపించారు. అందుకే ప్రగతి భవన్‌ను సీజ్ చేసి సీఎం కేసీఆర్‌ను న్యాయస్థానం ముందుకు పిలవాలని సూచించారు.
ఈ మేరకు ఎన్వీఎస్ఎస్ బీజేపీ స్టేట్ ఆఫీసులో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈడీ నోటీసులు అందుకున్నోళ్లకు కౌంటర్ సలహాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నియమించిన లాయర్లు, పోలీసులు ప్రగతి భవన్లో సలహాలు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు వత్తాసు పలుకుతున్న ఆ లాయర్లు, పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనైతిక చర్యలకు, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు, అవినీతి.. అక్రమాలకు పాల్పడేవాళ్లకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందని ఎన్వీఎస్ఎస్ ఆరోపించారు.
కాంగ్రెస్ పని ఖతం..
కాంగ్రెస్ లో కోవర్టులంటూ ఆ పార్టీ నేతలే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని, టీఆర్ఎస్ కు, సీఎం కేసీఆర్‌కు అసలు కోవర్టు కాంగ్రెస్ హైకమాండేనని ఎన్వీఎస్ఎస్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. కాంగ్రెస్ ను బలహీనపరిచి, తాము బలపడాలని కోరుకోవట్లేదని అన్నారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు.