ముస్లిం వ్యక్తితో కూతురి పెళ్లి.. క్యాన్సిల్ చేసుకున్న బీజేపీ నేత

ముస్లిం వ్యక్తితో కూతురి పెళ్లి.. క్యాన్సిల్ చేసుకున్న బీజేపీ నేత

బీజేపీ నేత, ఉత్తరాఖండ్‌లోని పౌరీ మున్సిపాలిటీ చెర్మైన్  యశ్‌పాల్‌ బెనమ్‌ తన కుమార్తె వివాహాన్ని  రద్దు చేసుకున్నారు. 2023 మే 28న తన కూతురు మోనికాకు అమేథీ నివాసి అయిన  మహ్మద్ మోనిస్‌ తో హిందూ సాంప్రదాయ పద్దతిలో వివాహాన్ని జరిపించాలని ముహుర్తాన్ని ఫిక్స్ చేశారు.  మోనికా, మోనిస్‌ ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు, ఇప్పుడు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. 

ఇరు కుటుంబాల అంగీకారంతోనే వీరి పెళ్లికి అంగీకారం కుదిరింది.  వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దీంతో బీజేపీ మద్ధతుదారులతోపాటు ప్రత్యర్థి పార్టీలకు చెందినవారు కూడా యశ్‌పాల్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  కూతురిని ముస్లిం వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తున్నారంటూ విమర్శించారు.  దీంతో ఆయన ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. 

కూతురి సంతోషం కోసం ముస్లిం యువకుడికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నానని, కానీ ఈ పెళ్లి ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత రావటంతో వాయిదా వేసుకున్నానని ఆయన చెప్పారు.  ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి అంగీకారం కుదిరిందని, అయితే కొన్ని విషయాలు తెరపైకి రావడంతో వివాహాన్ని  విరమించుకోవాల్సి వచ్చిందని బెనామ్ మీడియాకు తెలిపారు. 

ఇదిలా ఉండగా పౌరీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌గా బెనమ్ గత  40 సంవత్సరాలుగా బీజేపీలోనే ఉన్నారు. ఆయన భార్య  వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.