హైదరాబాద్, వెలుగు: పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీయే కూటమికి విజయాన్ని అందించిన ప్రజలకు బీజేపీ జాతీయ నేత, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల కో-ఇన్‌చార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అభినందనలు తెలిపారు. సోమవారం వెలువడిన ఫలితాలపై ఆయన స్పందిస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు.
అస్సాం ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వరుసగా మూడోసారి బీజేపీని గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించారని పొంగులేటి కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే పుదుచ్చేరిలోనూ వరుసగా రెండోసారి ఎన్డీయేకే ప్రజలు మొగ్గు చూపడం అక్కడ జరుగుతున్న స్థిరమైన పాలనకు నిదర్శనమన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన విజయం అత్యంత కీలకమని పొంగులేటి విశ్లేషించారు. ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, అరాచక పాలనకు స్వస్తి పలికి అభివృద్ధి వైపు అడుగులు వేశారని ఆయన తెలిపారు. తమిళనాడులో రాజకీయ మార్పు కోసం బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తున్నారని, వారి కష్టం వృథా పోదని ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా కేరళలో కూడా బీజేపీ బలం క్రమంగా పెరుగుతోందని, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలనను అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని పొంగులేటి పేర్కొన్నారు.
