షిండే వర్గానికి తొలి గెలుపు

షిండే వర్గానికి తొలి గెలుపు
  • స్పీకర్‌‌‌‌గా ఎన్నికైన బీజేపీ లీడర్ రాహుల్ నర్వేకర్
  • 57 ఓట్ల తేడాతో ఓడిన కూటమి అభ్యర్థి రాజన్ సాల్వి
  • షిండే సర్కారుకు ఇయ్యాల్నే బల పరీక్ష
  • ఈజీగా గట్టెక్కే అవకాశం

ముంబై: మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన శివసేన రెబెల్స్, బీజేపీ ప్రభుత్వానికి తొలి విజయం దక్కింది. స్పీకర్ సీటు కోసం జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్ గెలిచారు. 57 ఓట్ల తేడాతో మహావికాస్ అఘాడీ కూటమి అభ్యర్థి రాజన్ సాల్వి ఓడిపోయారు. రాహుల్‌‌కు 164, రాజన్‌‌కు 107 ఓట్లు పడ్డాయి. రెండు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఆదివారం ఉదయం 11 గంటలకు విధాన్‌‌ భవన్‌‌లో మొదలయ్యాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉన్నాయి. సేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే చనిపోయారు. ఎన్సీపీ ఎమ్మెల్యే నర్‌‌‌‌హరి జిర్వాల్ డిప్యూటీ స్పీకర్‌‌‌‌గా ఉండటంతో ఆయన ఓటు వేసే అవకాశం లేదు. మిగిలిన వారిలో 271 మంది ఓటేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌‌కు దూరంగా ఉన్నారు. మరో 12 మంది ఎమ్మెల్యేలు సభకు రాలేదు. ఓట్లను కౌంట్ చేసిన తర్వాత మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ జిర్వాల్.. ‘‘కొందరు శివసేన ఎమ్మెల్యేలు పార్టీ విప్‌‌ను ధిక్కరించారు. రికార్డింగ్‌‌ను వెరిఫై చేస్తాం. విప్ ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు. మరోవైపు సెషన్ ప్రారంభానికి ముందు ఏక్‌‌నాథ్ షిండే వర్గం.. విధాన్‌‌భవన్‌‌లోని లెజిస్లేటివ్ పార్టీ ఆఫీసును సీల్ చేసింది. అక్కడ ఓ నోటీసు అంటించింది. ‘శివసేన లెజిస్లేటివ్ పార్టీ సూచనల మేరకు ఈ ఆఫీసును క్లోజ్ చేశాం’ అని అందులో పేర్కొన్నారు.
 

కసబ్​కూ ఇంత సెక్యూరిటీ పెట్టలే: ఆదిత్య థాక్రే
లగ్జరీ హోటల్‌‌ నుంచి విధాన్‌‌భవన్‌‌లోకి వస్తున్న రెబల్ ఎమ్మెల్యేలకు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయడంపై శివసేన లీడర్ ఆదిత్యథాక్రే మండిపడ్డారు. ‘‘కసబ్‌‌కి కూడా అంత భద్రత ఏర్పాటు చేయలేదు. ముంబైలో ఇలా ఎప్పుడూ చూడలేదు. మీరు ఎందుకు భయపడుతున్నారు. ఎవరైనా పారిపోతున్నారా?’’ అని ప్రశ్నించారు. 
 

అల్లుడు స్పీకర్.. మామ చైర్మన్
దేశంలోనే చిన్న వయసులో స్పీకర్‌‌‌‌ పదవి చేపట్టిన లీడర్‌‌‌‌గా రాహుల్ నర్వేకర్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆయనకు 45 ఏండ్లు. ఇక రాహుల్ 
నర్వేకర్ మామ రామ్‌‌రాజే నాయక్ శాసన మండలి చైర్మన్‌‌గా ఉన్నారు. అయితే ఆయన ఎన్సీపీలో ఉన్నారు. ఒకే టైమ్‌‌లో స్పీకర్‌‌‌‌గా అల్లుడు, చైర్మన్‌‌గా మామ పదవి చేపట్టడం విశేషం.
 

ఎవరి బలం ఎంత?
ఏక్‌‌నాథ్ షిండే సర్కారు సోమవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. సెమీ ఫైనల్ లాంటి స్పీకర్ ఎన్నికలో గెలవడంతో కొత్త ప్రభుత్వం జోష్‌‌లో ఉంది. షిండే క్యాంపులోని 16 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ సుప్రీంకోర్టును శివసేన ఆశ్రయించింది. సుప్రీం కనుక వీరిని సస్పెండ్ చేస్తే.. సభలో మ్యాజిక్ ఫిగర్ 137 కానుంది. అయినప్పటికీ షిండే–ఫడ్నవీస్ సర్కారుకు 148 ఓట్ల బలం ఉండనుంది ఒకవేళ మొత్తం 39 మంది రెబల్ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయినా.. అధికారపార్టీ బలపరీక్షలో నెగ్గే అవకాశాలు ఎక్కువ. 39మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే.. మ్యాజిక్ ఫిగర్ 125 కానుంది. ఈ లెక్కన చూసుకున్నా షిండే సర్కారుకు ఢోకా లేదు.