రైతులు అప్పుల బాధతో ఉరి తాడుకు బలవుతున్నారు

రైతులు అప్పుల బాధతో ఉరి తాడుకు బలవుతున్నారు

హైదరాబాద్: అప్పుల బాధతో రైతులు ఉరేసుకొని చనిపోతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. గత ఎన్నికల్లో ఓట్ల కోసం రుణ మాఫీ అని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు హుజురాబాద్ ఎన్నిక కోసం మళ్లీ అబద్ధాలు చెబుతోందని ఆమె అన్నారు. కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుతున్న ‘దళిత బందు పథకం’ అనే నాటకాన్ని తెర మీదకు తీసుకొచ్చారిన ఆమె చెప్పారు. 

‘2018 ఎన్నికల నేపథ్యంలో రైతులకు లక్షరూపాయల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి... అధికారంలోకి వచ్చిన తర్వాత, కేవలం కొంతమంది రైతులకు 25 వేలు మాత్రమే రుణమాఫీ చేశారు. దీంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వకపోవడమే కాకుండా... ఉన్న రుణానికి వడ్డీ కట్టించుకుంటూ రెన్యూవల్ చేస్తున్నాయి. పంట రుణమాఫీ కోసం రైతన్నలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఇదిగో రుణమాఫీ, అదిగో రుణమాఫీ అంటూ ఓట్లు దండుకొని, గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచి.. ఇప్పుడు మళ్ళీ హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనైనా రుణవిముక్తి కలుగుతుందని సంబరపడ్డ రైతుల కళ్ల వెంబడి కన్నీళ్లు కారేలా చేస్తోంది. సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆగస్ట్ 1న తేదీన జరిగిన కేబినెట్ మీటింగ్‌లో రైతు రుణమాఫీకి రూ. 2006 కోట్లు అవసరమని ప్రతిపాదన చేసి, స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా.. 50 వేల లోపు ఉన్న రుణాలకు రుణ విముక్తి కల్పిస్తామని ప్రకటన చేశారు. ఆగస్టు 16 నుంచి 31 లోపున వేస్తామని ఆశ పెట్టి, కేవలం ఆగస్ట్ 26 వరకు కొంతమంది రైతులకు మాత్రమే బ్యాంకు ఖాతాలో డబ్బు వేసి, ఆగస్ట్ 26 తర్వాత 4.97 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.1682 కోట్లకు గాను.. ఒక్క రూపాయి కూడా వేయకపోవడంతో తెలంగాణ రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మారింది. గత సంవత్సరం, ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి, మినుము, వరి పంటలు దెబ్బతినగా... ఇప్పుడు రుణమాఫీ జరగక, రాయితీ విత్తనాలు ఇవ్వక, రైతులు అప్పుల బాధతో ఉరి తాడుకు బలవుతున్నారు. బ్యాంకు నుండి తీసుకున్న పంట రుణాల రుణమాఫీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుతున్న 'దళిత బందు పథకం' అనే నాటకం కోసం... రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ నిధులు తరలిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అప్పుల ఊబిలో ఉన్న రైతుల పట్ల అశ్రద్ధ వహిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా యావత్ తెలంగాణ రైతులు ఆలోచించాలి. టీఆర్ఎస్ సర్కార్ ఆడుతున్న కపట నాటకాన్ని గమనించి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ది చెప్పాలి’ అని విజయశాంతి పోస్ట్ చేశారు.