కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడినోళ్ల గొంతు కోశాడు

కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడినోళ్ల గొంతు కోశాడు

తెలంగాణ కోసం పోరాడినోళ్ల గొంతును కేసీఆర్ కోసేశాడని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. సాగర్ ఉపఎన్నిక ప్రచారానికి సమయం ఉంది కానీ.. మహనీయులకు నివాళులు అర్పించాడానికి కేసీఆర్‌కు సమయం లేదని ఆయన ఎద్దేవా చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జంగం బస్తీలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జంగం బస్తీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. అంబేద్కర్ ప్రపంచంలోనే గొప్ప మహనీయుడు. ఆయన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. దళితులకు హక్కులను కల్పించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమతమ హక్కులను వాడుకోవాలి. అంబేద్కర్ పేదల ఆశాజ్యోతి. సీఎం కేసీఆర్ కూడా అంబేద్కర్ స్మరణ చేసేవాడు. అంబేద్కర్ వల్లే తెలంగాణ వచ్చింది అన్నాడు. మరి దళితుడిని సీఎం ఎందుకు చేయలేదు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఇద్దరితోనే రాష్ట్రం సాధించుకున్నారా?. తెలంగాణా కోసం పోరాడిన వాళ్ల గొంతు కోశాడు. కోదండరాం, విజయశాంతి, అలె నరేంద్ర వంటి వాళ్లందరి గొంతులు కోశాడు’అని ఆయన అన్నారు.