ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తాం

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తాం

సీఎం కేసీఆర్ ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఆరో రోజు ప్రజాగోస-బీజేపీ భరోసా యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఇందులో భాగంగా పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రజలకు మంచి రోజులు రావాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.

ఇసుక మాఫియా తవ్విన గుంతల్లో పడి ఈమధ్య నలుగురు చనిపోయినట్లు షెట్లూరు గ్రామాస్థులు వివేక్ వెంకటస్వామికి వివరించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన తెలపారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇసుక మాఫియాను అంతం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. స్పౌజ్ బదిలీలు చేపట్టకపోవడంతో ఉద్యోగులైన భార్యాభర్తలు కష్టాలు పడ్తున్నారని తెలిపారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కేసీఆర్ సర్కారు ఉందని విమర్శించారు. 

ఇక ఈ యాత్రలో భాగంగా నిజాంసాగర్, బీచ్కుంద మండలాల నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వందమంది వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీ చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వ పని తీరు చూసి ఆకర్షితులమై బీజేపీలో చేరుతున్నట్లు నేతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని వివేక్ వెంకటస్వామి అన్నారు.