
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ప్రధాని మోడీ సూచించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎంపీలు, పార్టీ లీడర్లు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండి సమస్యలు తెలుసుకోవాలని చెప్పారని తెలిపారు. ఆదివారం హెచ్‌ఐసీసీ వద్ద మీడియాతో వివేక్ మాట్లాడారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు మోడీ శ్రీకారం చుట్టారని, అనేక సంక్షోభాలు ఎదురవుతున్నా దేశాన్ని సరైన దారిలో తీసుకెళ్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లు తెలంగాణ ప్రజలకు అందడంలేదన్నారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 16 లక్షల ఇండ్లు కోల్పోయామని చెప్పారు.