సీఎం మాటలు విని జనం నవ్వుకుంటున్నరు 

సీఎం మాటలు విని జనం నవ్వుకుంటున్నరు 
  • సీఎం మాటలు విని జనం నవ్వుకుంటున్నరు 
  • ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఖూనీ చేస్తోందని ఫైర్ 
  • వరద బాధితులను ఆదుకోవాలని పెద్దపల్లి, మంచిర్యాలలో ఆందోళన
  • మంచిర్యాలలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

పెద్దపల్లి/మంచిర్యాల, వెలుగు : వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ రోజుకో తీరు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్​హౌస్లు మునిగిన విషయాన్ని పక్కదారి పట్టించేందుకే క్లౌడ్ బరస్ట్, విదేశీ కుట్ర అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం మాటలు విని అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం బ్యాక్​వాటర్ కారణంగా పంటలు, ఇండ్లు మునిగిన బాధితులను ఆదుకోవాలని బుధవారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో నిర్వహించిన ఆందోళనల్లో వివేక్ పాల్గొన్నారు. బీజేపీ నేత చందుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో నిర్వహించిన ధర్నాలో, పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో నిర్వహించిన మౌనదీక్షలో పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరం డిజైనింగ్ లోపాల వల్లే వరదలు వస్తున్నాయని వివేక్ అన్నారు. కేసీఆర్ తనకు నచ్చినట్లుగా డిజైన్ మార్చారని,  అది కరెక్టు కాదని చెప్పినా వినకుండా ప్రజలను మోసగించి ప్రాజెక్టు కట్టారని ఫైర్ అయ్యారు. బ్యాక్​వాటర్​తో ఇప్పటి వరకు వేలాది ఎకరాల్లో పంటలు మునిగిపోగా, ఈసారి పట్టణాలు, గ్రామాలు కూడా మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో పేదలు రోడ్డున పడ్డారని కూలిన ఇండ్లకు బదులు కొత్త ఇండ్లు కట్టివ్వాలని, భద్రాచలంలో ప్రకటించినట్లుగానే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోనూ వరద బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఓటమి భయంతోనే దాడులు.. 
మంచిర్యాలలో మౌన దీక్ష చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీల్లాగా దాడి చేశారని వివేక్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాల  నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఫైర్ అయ్యారు. ఇలాంటి దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని అన్నారు. ‘‘టీఆర్ఎస్ చేయించుకున్న సర్వేల్లోనే ఆ పార్టీ గ్రాఫ్ మూడో స్థానానికి పడిపోయినట్టు తేలింది. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ లీడర్లు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. అందుకే దాడులకు పాల్పడుతున్నారు” అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​ను గద్దె దించితేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. కాగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ ఐబీ చౌరస్తాలో అంబేద్కర్​విగ్రహానికి వినతిపత్రం అందించారు. జీఎస్టీ కౌన్సిల్​లో అన్ని రాష్ర్టాల ఆర్థిక మంత్రులు ఉంటారని, అందరి ఆమోదంతోనే పెంపు నిర్ణయం జరుగుతుందని.. దానిపై అవగాహన లేకుండా టీఆర్ఎస్ నిరసనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
అన్నారం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. 
మునిగిపోయిన అన్నారం పంప్​హౌస్​ను పరిశీలించడానికి మంథనిలో ధర్నా తర్వాత వివేక్ బయలుదేరారు. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. బ్యారేజ్​దగ్గరకు వెళ్లనివ్వాలని కోరినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో వివేక్ వెనుదిరిగి వెళ్లారు. సునీల్​రెడ్డి సహా పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత విడిచిపెట్టారు.

బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి 
మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో మౌన దీక్ష సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పాలపై జీఎస్టీ విధించడానికి నిరసనగా టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో అదే చౌరస్తాలో గేదెలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో సర్కిల్ వద్దనున్న బీజేపీ జెండాలను గేదెలకు కట్టేందుకు ప్రయత్నించారు. దీనిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. టీఆర్ఎస్ కార్యకర్తలు జెండా కర్రలతో బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు. చెప్పులు విసిరారు. ఎమ్మెల్యే కొడుకు విజిత్ రావు తమ అనుచరులను మరింత రెచ్చగొట్టారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ టైమ్ లో పోలీసులను విజిత్ రావు తోసేశారు. దాడిపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.