తెలంగాణలో అధికారమే లక్ష్యం

తెలంగాణలో అధికారమే లక్ష్యం

HICCలో రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాలపై ఇవాళ్టి కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. మధ్యాహ్నం వరకు కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత విజయ సంకల్ప సభ కోసం పరేడ్ గ్రౌండ్స్ కు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ప్రధాని సూచించారన్నారు. ఎంపీలు, పార్టీ నాయకులు 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తెలుసుకోవాలని వెల్లడించారన్నారు.

దేశంలో ఆర్థిక సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని, సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ స్కీంలు తెలంగాణ ప్రజలకు అందట్లేదన్నారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో అనేక చర్చలు జరిగాయన్నారు. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ఉన్నా దేశ పరిస్థితిని సరైన దిశలో మోడీ తీసుకెళ్లారని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు సంక్షోభంలో కొనసాగుతున్నాయని.. అయినా ఇక్కడ సమస్య రాకుండా చూశారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం తెలంగాణ సర్కార్ ఉపయోగించుకోకపోవడంతో16 లక్షల ఇళ్లు కోల్పోవడం జరిగిందన్నారు.