
హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతలు రేపిస్టులను సపోర్ట్ చేస్తున్నారని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. సోమవారం సిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అసదుద్దీన్ పాల్గొని మాట్లాడారు. యూపీలో దళిత బాలికపై, కశ్మీర్లో జరిగిన రేప్ కేసుల్లో బీజేపీ నేతలే నిందితుల ని ఆరోపించారు. అశ్లీల వీడియోలు తీసి మహిళల జీవితాలు చెలగాటమాడుకున్న జేడీఎస్హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఓటేయాలని ప్రధాని మోదీ అడ గడం దారుణమన్నారు. ‘నారీ శక్తి’ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రధాని మోదీ ఇలాంటి వాళ్లకు మద్దతు తెలపడం ఏమిటని నిలదీశారు. బీజేపీ సపోర్ట్ లేకుండా రేవణ్ణ రాత్రికి రాత్రే జర్మనీ ఎలా పారిపోయాడని ప్రశ్నించారు. అదే ముస్లింలు అయితే మీడియా నానా హంగా మా చేసేదని, ఇప్పుడెందుకు స్పందించడం లేదన్నారు. పదేండ్ల పాలనలో మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ ఒవైసీ సోమవారం మలక్‌పేటలో పర్యటించారు. స్థానికులను కలిసి ఓట్లు అభ్యర్థించారు.