
- స్వాగతించిన పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు
- గందరగోళమని తప్పుపట్టిన ఎంపీ ఈటల
- నేతల తీరుపై పార్టీలో చర్చ.. క్యాడర్లో కన్ఫ్యూజన్
హైదరాబాద్/హనుమకొండ, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై బీజేపీ కీలక నేతలు తలోమాట మాట్లాడటంతో ఆ పార్టీ క్యాడర్ లో గందరగోళానికి దారి తీసింది. పార్టీలోని సీనియర్ నేతలు ఈ అంశంపై విరుద్ధమైన ప్రకటనలు చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్9 రిలీజ్ చేసింది. ఈ జీవోను స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో తాము మొదటి నుంచీ మద్దతు ఇస్తున్నామని, ఈ దిశగా ప్రభుత్వ నిర్ణయాన్ని సపోర్టు చేస్తున్నామని వెల్లడించారు.
రిజర్వేషన్లను తామే అడ్డుకుంటున్నామని ఇన్నాళ్లూ కాంగ్రెస్ డ్రామాలు ఆండిందని, కానీ జీవో ద్వారా ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ నిలబడుతుందని రాంచందర్రావు అన్నారు. అయితే, ఈ ప్రకటనకు భిన్నంగా తాజాగా హనుమకొండలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదంటూనే.. లీగల్ గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రకటన చేశారు. రిజర్వేషన్లు తప్పులతడకగా ఉన్నాయని ఆరోపించారు. ‘‘రిజర్వేషన్లపై ఎవరూ కోర్టుకు వెళ్లవద్దని ముగ్గురు మంత్రులు అప్పీల్ చేయడం ఏంటీ? డెడికేషన్కమిషన్ద్వారా కులగణన చేసి రిజర్వేషన్లు ప్రకటించినప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్తే మీకు వచ్చే సమస్య ఏంటో చెప్పాలి? ఎవరిని మోసం చేయడం కోసం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారో స్పష్టం చేయాలి” అని ఈటల డిమాండ్ చేశారు. బిహార్ లో 2023లో బీసీ రిజర్వేషన్లు 65% పెడ్తే సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. మహారాష్ట్రలో కూడా రిజర్వేషన్లు కల్పించి, ఎన్నికలు నిర్వహించారని, కానీ ఆ తర్వాత వికాస్ కిషన్ రావు అనే వ్యక్తి కోర్టుకు వెళ్తే 5 జిల్లాల్లో ఎన్నికలు రద్దయ్యాయని ఈటల తెలిపారు.
క్యాడర్లో కన్ఫ్యూజన్..
రిజర్వేషన్ల జీవోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వాగతిస్తే, పార్టీలోని మరో ముఖ్య నేత జీవో లీగల్గా నిలబడదని వ్యాఖ్యలు చేయడంతో కమలం పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈ కీలక తరుణంలో, ప్రభుత్వ నిర్ణయంపై నేతలు తలోవిధంగా మాట్లాడడం గందరగోళానికి దారితీస్తోంది. పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు.. రాష్ట్ర అధ్యక్షుడి మాటే ఫైనల్ అంటూ పలుమార్లు ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ, ఓసీ సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షుడు మద్దతిస్తుండగా.. బీసీ వర్గానికి చెందిన నేత తప్పు పట్టడాన్ని పార్టీలోని బీసీ వర్గాలు తప్పుపడుతున్నాయి.