ముస్లిం యువకుడితో బీజేపీ నేత కుమార్తె పెళ్లి.. వైరల్ అవుతోన్న వెడ్డింగ్ కార్డు

ముస్లిం యువకుడితో బీజేపీ నేత కుమార్తె పెళ్లి.. వైరల్ అవుతోన్న వెడ్డింగ్ కార్డు

ఓ బీజేపీ నేత కుమార్తె పెళ్లి కార్డు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఉత్తరాఖండ్‌లోని పౌరీ ప్రాంతానికి చెందిన యశ్‌పాల్‌ బెనమ్‌ కూతురును ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేస్తుండడంతో ఆయనపై జనాలు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ మద్దతుదారులు, ప్రత్యర్థులు ఇద్దరూ బెనమ్‌ను విమర్శించడంతో పాటి వారి పెళ్లి కార్డ్ పైనా పలు కామెంట్లు చేస్తున్నారు.

హిందూత్వ కరడుగట్టినవారు మాజీ ఎమ్మెల్యేపై, బీజేపీ పార్టీపై పలు ఆరోపణలతో ట్రోల్ చేస్తుంటే, మరికొందరు మాత్రం వీరి వివాహాన్ని ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీస్‌తో పోలుస్తూ "లవ్ జిహాద్" అని పిలుస్తున్నారు .

“బీజేపీ పాలిత రాష్ట్రాలు 'ది కేరళ స్టోరీ' వంటి సినిమాలను పన్ను రహితంగా మార్చేశాయి. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. బీజేపీ నాయకుడి కుమార్తె ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోనుంది. దీంతో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ జరుగుతోంది. “లవ్ జిహాద్”అని ఆరోపించే బీజేపీ పార్టీలో ఉన్న బెనమ్.. తన కుమార్తెను ముస్లిం వ్యక్తితో వివాహం చేసుకోకుండా ఆపడంలో మాత్రం విఫలమయ్యాడని పలువురు సోషల్ మీడియా యూజర్స్ ఆరోపిస్తున్నారు.

మే 28న ఉత్తరాఖండ్ లోని ఓ రిసార్ట్‌లో ఈ వివాహం జరగనుంది. తన కూతురు లక్నో యూనివర్శిటీలో చదివిందని, ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉందని నాయకుడి సన్నిహితులు తెలిపారు. ఇదిలా ఉండగా పౌరీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌గా బెనమ్ ఉన్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయన 2007లో పౌరీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఈ పెళ్లికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రాజకీయ నేతలకు కూడా ఆహ్వానం అందింది.