ఎన్నికల రూల్స్ను ఉల్లంఘిస్తున్నరు రాజకీయ లబ్ధి కోసమే ..అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నరు : పాయల్ శంకర్

ఎన్నికల రూల్స్ను ఉల్లంఘిస్తున్నరు రాజకీయ లబ్ధి కోసమే ..అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నరు : పాయల్ శంకర్
  • సీఎం రేవంత్​పై ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెడుతున్నారని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ విమర్శించారు. బీఆర్కేఆర్ భవన్ లో ఎన్నికల కమిషన్ అధికారులను గురువారం ఆ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డితో పాటు కలిశారు. మంత్రివర్గ విస్తరణపై ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. 

అనంతరం పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడారు. ‘‘అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడమంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక వర్గాన్ని ప్రభావితం చేయడమే అవుతుంది. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తది. ఒక వర్గానికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నరు. ఎన్నిక తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసుకోవాలి. 

ఉన్న ఫళంగా మంత్రివర్గ విస్తరణ చేయడం.. అజారుద్దీన్ కు పదవి ఇవ్వడం వెనుకున్న ఆంతర్యమేంటి? కాంగ్రెస్ రోజు రోజుకూ దిగజారిపోతున్నది’’అని పాయల్ శంకర్ విమర్శించారు. మంత్రి పదవి ఆశచూపి ఆ వర్గాన్ని మోసం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. సినీ కార్మికులను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేయడం కరెక్ట్ కాదని విమర్శించారు. ఆ కార్యక్రమానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. 

ఫసల్ బీమా అమలు చేయాలి

రాష్ట్రంలో ఫసల్ బీమా స్కీమ్​ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పాయల్ శంకర్ అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫసల్ బీమా అమలు చేసి ఉంటే నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతాంగం ఆగమైందని, వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రభుత్వం బేషరతుగా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే లీగల్ గా ముందుకు వెళ్తామని హెచ్చరించారు.