
- బండి సంజయ్ అరెస్ట్‌పై మండిపడ్డ బీజేపీ నేతలు
- సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన
నెట్‌వర్క్, వెలుగు: బీఆర్‌ఎస్ సర్కారు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టు చేయడమేంటని బీజేపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసి... సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాగా, పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పలుచోట్ల కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం నేతలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయిన కూతురు కవిత, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి బాధ్యుడైన కొడుకు కేటీఆర్‌ను కాపాడుకునేందుకే బండి సంజయ్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. వరస పేపర్ లీక్‌లను పట్టించుకోని సర్కారు.. బీజేపీకి వస్తున్న ఆదరణ ఓర్వలేకనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప, మెదక్ జిల్లా ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్, నేతలు బొమ్మ శ్రీరామ్ నల్లాల విజయ్ కుమార్, ఎక్కలదేవి మధు, బెండ వీణ, రజనీకాంత్, బూర్గు సురేశ్ గౌడ్, గన్నబోయిన శ్రీనివాస్ గౌడ్, దండ్యాల లక్ష్మారెడ్డి, విక్రమ్ శంకర్, మురళీధర్ రెడ్డి, పవర్ ముదిరాజ్, యశ్వంత్, పత్రి శ్రీనివాస్ యాదవ్ తొడుపునూరి వెంకటేశం,యాదన్ రావు, పత్రి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పేపర్ లీక్ బీజేపీ కుట్ర
టీఎస్‌పీఎస్సీ, టెన్త్ పేపర్ లీక్‌లు బీజేపీ కుట్రేనని బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌వీ నేతలు ఆరోపించారు. బుధవారం జిల్లా, మండల కేంద్రాల్లో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీ తీరును ఎండగట్టారు. నారాయణ ఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ చేసిన రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త అని, టెన్త్ హిందీ పేపర్ లీక్ చేసిన మాజీ జర్నలిస్టు ప్రశాంత్ బండి సంజయ్ ప్రధాన అనుచరుడని ఆరోపించారు. కుట్రపూరితంగా పేపర్లు లీక్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీక్ చేసి సోషల్ మీడియా, టీవీల్లో వచ్చేలా ముందుగానే ప్లాన్ వేశారని విమర్శించారు. నీతిమాలిన రాజకీయాలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ తన పదవులకు రాజీనామా చేసి..విచారణ ఎదుర్కోవాలని సవాల్ చేశారు.