
- ఉపాధి హామీ నిధులు దారి మళ్లించి కేంద్రాన్ని బద్నాం చేస్తరా?
- ఢిల్లీలో కేసీఆర్ అభాసుపాలైండు: లక్ష్మణ్
- అభివృద్ధికి ఎగనామం పెట్టి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండని ఫైర్
- బీఆర్ఎస్ ధర్నాలపై బండి సంజయ్ ఫైర్
- అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఆందోళనలు చేస్తున్నరు
- సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నరు
- ఇక్కడి రైతులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమైనయని నిలదీత
న్యూఢిల్లీ, వెలుగు: స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్.. ఇలా అన్నీ తానై కేసీఆర్ నటించినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఫ్లాప్ సినిమాగా మారిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు. స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్‌ను కలిసినా.. ఎవ్వరూ బీఆర్ఎస్ వైపు చూడలేదన్నారు. ఇచ్చిన హామీలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పన్నిన పన్నాగమే బీఆర్ఎస్ అని ఫైర్ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఓట్ల శాతం.. అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఉండాలని, ప్రజలు జాతీయ హోదా కల్పించాలని, అంతేతప్ప జాతీయ పార్టీ అని కేసీఆర్ ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఎవరూ అంగీకరించరని చెప్పారు. కనీసం ఏపీ ఛాయల్లోకి కూడా బీఆర్ఎస్ వెళ్లే పరిస్థితి లేదని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో జరుగుతున్న అభివృద్ధికి బీజేపీ పాలిత రాష్ట్రాలు నిదర్శనంగా మారాయన్నారు. కేసీఆర్ సర్కార్ మాత్రం సంక్షేమం, అభివృద్ధికి ఎగనామం పెట్టి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. తొలిసారిగా పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ అంశాలను తాను లేవనెత్తినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తున్న తీరును సభ్యుల దృష్టికి తెచ్చానన్నారు. దాదాపు 15 ప్రశ్నలు అడిగానని, మూడు స్పెషల్ మెన్షన్లు, మూడు సార్లు జీరో అవర్లో మాట్లాడానని చెప్పారు.
కేసీఆరే రైతు ద్రోహి: పొంగులేటి
తెలంగాణలో రైతు సమస్యలపై రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ఆందోళనలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కిలాడీ సీఎం కేసీఆర్‌యే నిజమైన రైతు ద్రోహి అని ఫైర్ అయ్యారు. ఒకప్పుడు బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టారని, ఇప్పుడు బీఆర్ఎస్‌తో అదే సినిమాను దేశంలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని చెప్పారు. ఉపాధి హామీ స్కీం నిధులను మళ్లించి, వాటిలో కూడా రైతు అజెండాను జోడించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు బ్యాంకులు రుణం ఇచ్చే పరిస్థితి లేకుండా కేసీఆర్ చేశారని, దీంతో వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.