కొమురవెల్లి, వెలుగు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కొమురవెల్లి మండల బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో కలిసి మల్లికార్జున స్వామి ప్రసాదం అందజేశారు. కొమురవెల్లిలో నిర్మిస్తున్న మల్లన్న హాల్ట్ రైల్వేస్టేషన్ పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. జాతర సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థ వల్ల భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రికి వివరించారు.
స్పందించిన మంత్రి కొమురవెల్లిలో మెరుగైన మొబైల్ కమ్యూనికేషన్ ఉండేలా ఆపరేటర్లకు ఆదేశాలు జారీచేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు స్వరూప, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ నాయకులు మధు, నాగరాజు, భరత్ పాల్గొన్నారు.
