న్యాయంగా ఎన్నికలు జరిపించండి: ఈసీని కోరిన బీజేపీ నేతలు

న్యాయంగా ఎన్నికలు జరిపించండి: ఈసీని కోరిన బీజేపీ నేతలు

గ్రేటర్  హైదరాబాద్  ఎన్నికలపై  రాష్ట్ర  ఎన్నికల  కమిషన్ కసరత్తు కొనసాగుతోంది. గుర్తింపు పొందిన 11 రాజకీయ  పార్టీల  ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు ఎన్నికల కమిషన్ పార్ధసారథి. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరవుతున్నారు. ఒక్కో పార్టీ నేతలతో విడివిడిగా భేటీ అవుతున్నారు పార్ధసారథి. ఇందులో భాగంగా ఒక్కోపార్టీకి 15 నిమిషాల టైం ఇచ్చింది ఈసీ. వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఖరారు, కోడ్ ఆఫ్ కండక్ట్ పై ప్రధానంగా నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు ఎన్నికల కమిషనర్.  పోటీ చేసే అభ్యర్థుల వ్యయం, చెల్లించాల్సిన డిపాజిట్ తో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.

మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమావేశమైన బీజేపీ నేతలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఆంటోనీ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి…ఓటరు జాబితాలో అవకతవకలపై EC దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ బూత్ వారీగా ఓటరు జాబితా ఇవ్వాలని ఎన్నికల కమిషన్ పార్ధసారథిని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన చింతల రామచంద్రారెడ్డి..GHMC అధికారులు .. కార్పొరేటర్లతో కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను తొలగించారన్నారు.

గ్రేటర్ అధికారులను ప్రిసైడింగ్ అధికారులుగా నియమించవద్దని..ప్రభుత్వానికి తొత్తులుగా అధికారులు పనిచేస్తున్నారన్నారు చింతల. కేంద్ర ప్రభుత్వ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. నోటిఫికేషన్ రోజు నుంచే మద్యం అమ్మకాలు నిలిపివేయాలన్నారు. బీసిీల రిజర్వేషన్లు ఇతర మున్సిపాలిటీల్లో ఒక రకంగా… GHMCలో మరోరకంగా ఎలా కేటాయిస్తారన్న ప్రభాకర్..డిలిమిటేషన్ లేదు అంటూనే… ఓట్లను తారుమారు ఎలా చేశారని ప్రశ్నించారు. GHMC, రాచకొండ, సైబరాబాద్ పోలీసు అధికారులపై నమ్మకం లేదన్నారు. శాస్త్రీయ విధానంలో ఇంటి నెంబర్లు ఎందుకు ఇవ్వలేదని..అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లలో ఉన్నవారికి ఓటు హక్కు ఎలా ఇచ్చారన్నారు.  దుబ్బాక అనుభవం దృష్టిలో పెట్టుకొని అధికారులు వ్యవహరించాలని.. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ పరంగా ఫెయిర్ గా ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు.