నాన్ లోకల్స్ కు వ్యతిరేకంగా నిరసన.. మర్రిగూడలో బీజేపీ నేతలపై లాఠీ చార్జ్

నాన్ లోకల్స్ కు వ్యతిరేకంగా నిరసన.. మర్రిగూడలో బీజేపీ నేతలపై లాఠీ చార్జ్

మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానికంగా ఉన్న పలు ఇళ్లలో మెదక్, సిద్ధిపేట (నాన్ లోకల్)కు చెందిన టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారంటూ స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకే నాన్ లోకల్ టీఆర్ఎస్ లీడర్లు ఇక్కడున్నారని ఆరోపించారు.

నాన్ లోకల్ టీఆర్ఎస్ లీడర్ల వాహనాలను అడ్డుకునేందుకు స్థానిక బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈక్రమంలో బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు  వారిపై లాఠీ చార్జి చేశారు. నాన్ లోకల్ టీఆర్ఎస్ లీడర్లపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అన్యాయంగా తమపై లాఠీ చార్జి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఓ ఇంట్లో కరీంనగర్ కు చెందిన టీఆర్ఎస్ నేతలు ఉన్నారంటూ స్థానిక బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న నాన్ లోకల్స్ ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో నాన్ లోకల్స్ గా భావిస్తున్న పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు నుంచి పరుగులు తీశారు. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా స్థానికేతరులు ఎందుకు ఇక్కడ ఉన్నారంటూ పోలీసులను బీజేపీ నేతలు నిలదీశారు.

వరంగల్, కరీంనగర్ జిల్లాల టీఆర్ఎస్ నేతలు చండూరులో ఉంటూ స్థానిక ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. స్థానికులైతే అక్కడే ఉండి సమాధానం చెప్పేవారని, స్థానికేతరులు కాబట్టే తమను చూడగానే పారిపోయారని బీజేపీ నేతలు వివరించారు. అయితే స్థానిక టీఆర్ఎస్ నేతలు కూడా చండూరులోని ఆ ఇంటి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులను పోలీసులు అదుపు చేశారు.