ఖమ్మం, వెలుగు: పెనుబల్లి మండలం ఏరుగట్లలో డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అక్రమాలపై జిల్లా అధికారులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కి ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి, బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
డబుల్ బెడ్రూమ్స్ కోసం ఎవరైతే స్థలాలను ఇచ్చారో, ఆ 15 మందికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ డబుల్ బెడ్ రూమ్స్ కేటాయిస్తామని తెలిపారు. మిగిలిన ఇండ్లు కూడా అర్హులైన లబ్ధిదారులకే అందజేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినట్లు తేలితే, వాటిని వెంటనే రద్దుచేసి, అర్హులకు కేటాయిస్తామని బీజేపీ బృందానికి కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏరుగట్ల గ్రామస్తులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కూడా జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు కలెక్టర్‌ను ప్రత్యేకంగా కోరారు.
ఇదే విషయంపై బీజేపీ నాయకులు జాతీయ స్థాయిలో కూడా ఫిర్యాదు చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర రావుకు, జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. వారు సానుకూలంగా స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇవి రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు విజయరాజ్, మండల అధ్యక్షుడు బుర్ర నరసింహారావు, జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కరిణి వీరంరాజు, సుదర్శన్ మిశ్రా, మట్టా ప్రసాద్, పడిగల మధుసూదన్, పర్సా రాంబాబు పాల్గొన్నారు.
