సర్జికల్​ స్ట్రయిక్స్​పై కేసీఆర్ కామెంట్లు సహించం

సర్జికల్​ స్ట్రయిక్స్​పై కేసీఆర్ కామెంట్లు సహించం

కేంద్ర ప్రభుత్వంపై వరుసగా సీఎం కేసీఆర్​చేస్తున్న కామెంట్లు పొలిటికల్​ హీట్​ను రాజేస్తున్నాయి. టీఆర్​ఎస్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శల తీవ్రతను పెంచుతున్నాయి. పుల్వామా ఘటన తర్వాత పాక్​ భూభాగంలో మన సైనికులు చేసిన సర్జికల్ స్ట్రయిక్స్​పై తనకూ అనుమానాలు ఉన్నాయని, ఆధారాలు కావాలని ఆదివారం ప్రెస్​కాన్ఫరెన్స్​లో కేసీఆర్ చేసిన కామెంట్లు వివాదాస్పదమవుతున్నాయి. సర్జికల్​ స్ట్రయిక్స్​లో పాల్గొన్న దేశ సైనికులను కేసీఆర్​ అవమానించారని, వీర జవాన్ల త్యాగాలను కించపరిచారని కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, అనురాగ్​ ఠాగూర్​ మండిపడ్డారు. సైనికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. ఇన్నేండ్లు మాట్లాడని కేసీఆర్​కు ఇప్పుడేం గుర్తుకు వచ్చిందని, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత ను తట్టుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర బీజేపీ లీడర్లు దుయ్యబట్టారు. సైనికుల త్యాగాలను అవమానిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 

న్యూఢిల్లీ, వెలుగు: సర్జికల్​ స్ట్రయిక్స్​పై అనుమానాలు ఉన్నాయని, ఆధారాలు కావాలని సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, మురళీధరన్, అస్సాం సీఎం హేమంత్​ బిశ్వ శర్మ  ఖండించారు. కేసీఆర్​ వ్యాఖ్యలు ముమ్మాటికి సాయుధ బలగాలను అవమానించడమేనని వారు మండిపడ్డారు.

క్షమాపణ చెప్పాలి: అనురాగ్​ ఠాకూర్​

రాహుల్​గాంధీ, కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్​ చేశారు. హుజూరాబాద్​లో టీఆర్​ఎస్​పై బీజేపీ సర్జికల్ స్ట్రయిక్స్​ తర్వాత కేసీఆర్​లో వణుకు మొదలైందని విమర్శించారు. ‘‘హుజూరాబాద్​ బైపోల్​ ఫలితాల తర్వాత కేసీఆర్​కు, టీఆర్ఎస్ కు కాళ్ల కింద భూమి వణుకుతున్నది. తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైంది. యూపీ ఎన్నికల వేళ సర్జికల్ స్ట్రయిక్స్​పై ప్రశ్నలు వేస్తున్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ పై పాకిస్థాన్, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకే పాట పడుతున్నాయి. ఎన్నికలు వస్తే చాలు హిజాబ్, సర్జికల్ స్ట్రయిక్స్ పై మాట్లాడుతుంటరు. భారత సైనికుల వీరత్వాన్ని ప్రశ్నించేలా కేసీఆర్ కామెంట్లు చేయడం శోచనీయం. అది ఆయన మానసిక వైఫల్యాన్ని చూపుతున్నది” అని ఆయన ట్వీట్​ చేశారు. టెర్రరిస్టుల శిబిరాలను మన సైనికులు ధ్వంసం చేశారనేది సత్యమన్నారు. కేసీఆర్ పరిపాలన నుంచి ప్రజలు త్వరగా విముక్తి పొందాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కాగా, సర్జికల్ స్ట్రయిక్స్​పై ఆధారాలు అడగడం అంటే సాయుధ బలగాల త్యాగాలను అవమానించడమేనని కేంద్ర మంత్రి మురళీధరన్​ మండిపడ్డారు. కేసీఆర్​ కామెంట్లను ఆయన తప్పుబట్టారు. 

దేశం విడిచిపెట్టదు: అస్సాం సీఎం

‘‘పుల్వామా అటాక్​కు మూడేండ్లయిన సందర్భంగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ సర్జికల్ స్ట్రయిక్స్​ను మళ్లీ ప్రశ్నిస్తూ, అమరవీరులను అవమానించాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్  పట్ల కేసీఆర్ తన విధేయతను నిరూపించుకోవడానికి పోటీ పడుతున్నట్లు కన్పిస్తున్నది. బీజేపీ మాత్రం దేశం పట్ల విధేయత చూపుతున్నది’’ అని అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మ ట్వీట్​ చేశారు. మన సైన్యంపై దుష్ప్రచారం చేయడానికి కేసీఆర్​ ఎందుకు తహతహలాడుతున్నారని  ప్రశ్నించారు. సాయుధ బలగాల పరాక్రమాన్ని కేసీఆర్  అవమానిస్తున్నారని,  మన సైనికుల త్యాగాన్ని అవమానిస్తే దేశం సహించదని, విడిచిపెట్టదని హెచ్చరించారు.  సర్జికల్ స్ట్రయిక్స్​కు సంబంధించిన వీడియోను ట్వీట్ కు ఆయన లింక్ చేశారు.

ఆ కామెంట్లు కేసీఆర్ అజ్ఞానానికి నిదర్శనం: కిషన్​రెడ్డి

దేశ సాయుధ బలగాలపై కేసీఆర్  బాధ్యతారహితంగా కామెంట్లు చేశారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. పుల్వామా దాడి జరిగి మూడేండ్లయితున్న సందర్భంగా కేసీఆర్ చేసిన కామెంట్లు ఆయన  అజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘సర్జికల్ స్ట్రయిక్స్​కు ఫ్రూఫ్ అడుగుతున్న కేసీఆర్​.. సాయుధ బలగాలపై దుష్ప్రచారం చేయడానికి తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్‌‌లో చేరారు. ప్రధాని మోడీని లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు. కానీ దేశం కోసం పోరాడే సాయుధ దళాలను అవమానించడం దారుణం” అని  ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఇండియన్​ ఆర్మీ సరిహద్దుల వెంట శత్రువులతో ధైర్యంగా పోరాడుతున్నదని, నిరుడు తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్ బాబు దేశ ప్రజల్ని రక్షించడానికి ప్రాణాలను వదిలారని గుర్తు చేశారు. దేశ రక్షణలో వీరమరణం పొందిన వారిని కేసీఆర్​ అవమానించేలా మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.