కాళేశ్వరం అవినీతికి నిలయంగా మారింది

కాళేశ్వరం అవినీతికి నిలయంగా మారింది

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతామని బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి ప్రభుత్వాన్ని ఓడించి ప్రజల పక్షాన నిలుస్తామని హామీ ఇచ్చింది. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రేమ, విశ్వాసం చూపుతున్నరని చెప్పింది. రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక వికాసానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చింది. హెచ్‌‌ఐసీసీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణపై స్టేట్‌‌మెంట్‌‌ను బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదివారం రిలీజ్‌‌ చేసింది. అంతకుముందు తెలంగాణ అంశంపై పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజూరాబాద్‌‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌ మాట్లాడారు. గత ఎనిమిదేండ్లలో రాష్ట్ర వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన చేయూతనిచ్చామని స్టేట్‌‌మెంట్‌‌లో బీజేపీ తెలిపింది.

‘‘ఉమ్మడి ఏపీ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి పార్లమెంట్‌‌లో బిల్లు పాస్‌‌ అయ్యేందుకు తోడ్పాటునందించాం. నీళ్లు.. నిధులు.. నియామకాలు సాధించుకోవాలనే లక్ష్యంతో ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. ఇందుకోసం ఎందరో యువత బలిదానాలు చేశారు. గడిచిన ఎనిమిదేండ్లలో ప్రజల ఆకాంక్షలేవీ నెరవేరలేదు.గద్దెనెక్కిన వాళ్లు తీవ్ర ద్రోహం చేశారు. నిరుద్యోగులు, దళితులు, యువకులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి నెరవేర్చలేదు. తెలంగాణలో 70 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వర్సిటీలను నిర్లక్ష్యం చేశారు. టీచర్ల రిక్రూట్‌‌మెంట్‌‌ను గాలికొదిలేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లు, మెడికల్‌‌ కాలేజీల్లో 70 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి” అని విమర్శించింది. 

లక్షల కోట్ల అప్పుల భారం

2014లో మిగులు బడ్జెట్‌‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు లోటు బడ్జెట్‌‌లోకి పడిపోయిందని, అప్పుల భారం రూ.3.2 లక్షల కోట్లకు చేరిందని స్టేట్‌‌మెంట్‌‌లో బీజేపీ విమర్శించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చెబుతున్న కాళేశ్వరం.. అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపించింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.40 వేల కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్లకు పెంచేడమే ఇందుకు నిదర్శనమని చెప్పింది.  

కీచకుల్లా ఎమ్మెల్యేల కొడుకులు

కేసీఆర్‌‌ కుటుంబ, అవినీతి పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని బీజేపీ చెప్పింది. రాష్ట్రంలో లా అండ్‌‌ ఆర్డర్‌‌ గాడి తప్పిందని, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. ఎమ్మెల్యేల కొడుకులు కీచకుల్లా మారి అత్యాచారాలకు తెగబడుతున్నారని, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు తెస్తే తెలంగాణలో రెండున్నరేండ్లు ఆలస్యంగా అమలు చేయడంతో చాలా మంది ఆ ఫలాలు కోల్పోయారని చెప్పుకొచ్చింది.

రైతుబంధు పేరు చెప్పి.. సబ్సిడీలు ఎగ్గొడుతున్నరు

రైతుబంధు ఇస్తున్నామని చెప్పి రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలను ఎగ్గొట్టారని బీజేపీ ఆరోపించింది. గడిచిన ఎనిమిదేండ్లలో కేసీఆర్‌‌ కుటుంబం కోసం తప్ప దేశం, రాష్ట్రం, ప్రాంతం కోసం చేసిందేమీ లేదని మండిపడింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇస్తున్నామని, ఆ నిధులను అభివృద్ధికి సక్రమంగా వినియోగించుకోకుండా కేసీఆర్‌‌ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్నదని చెప్పింది. ‘‘నేషనల్‌‌ హైవేలను 2,511 కి.మీ.ల నుంచి 4,996 కి.మీ.లకు పెంచాం. 2022 నాటికి ఇంకో 2,485 కి.మీ.ల మేర విస్తరిస్తాం. 340 కి.మీ.ల పొడవైన రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డును రూ.8 వేల కోట్లతో నిర్మించనున్నాం. రూ.31,281 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను తెలంగాణలో చేపట్టాం. కరోనా టైంలో రాష్ట్రంలోని 1.92 కోట్ల మందికి రూ.9 వేల కోట్ల విలువైన 25 లక్షల టన్నుల బియ్యం ఉచితంగా పంపిణీ చేశాం. పీఎం స్వనిధి స్కీం కింద స్ట్రీట్‌‌ వెండార్లకు రూ.433.34 కోట్ల సాయం చేశాం. స్వచ్ఛ భారత్‌‌ మిషన్‌‌లో భాగంగా 31.43 లక్షల ఇండ్లల్లో టాయిలెట్లు నిర్మించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి రూ.1,613.64 కోట్లు విడుదల చేశాం’’ అని అందులో వివరించింది.

బీజేపీనే ప్రత్యామ్నాయం

రాష్ట్రంలో అధికార టీఆర్‌‌ఎస్‌‌కు తామే అసలైన ప్రత్యామ్నాయమని బీజేపీ చెప్పింది. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నదని తెలిపింది. 2020 నవంబర్‌‌లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్‌‌ కొడుకు, అల్లుడు అన్నీ తామై పనిచేసినా బీజేపీ గెలిచిందని, అదే ఏడాది డిసెంబర్‌‌లో జరిగిన జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లలో విజయం సాధించిందని, టీఆర్‌‌ఎస్‌‌తో సమాన స్థాయిలో ఓట్లు సాధించిందని వివరించింది. ఇక 2021లో జరిగిన హుజూరాబాద్‌‌ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌‌ఎస్‌‌ ఎన్నో అక్రమాలకు పాల్పడినా బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తుచేసింది.