ఎన్నికల్లో అతి విశ్వాసం వద్దు : మంత్రి సీతక్క

ఎన్నికల్లో అతి విశ్వాసం వద్దు : మంత్రి సీతక్క

యాదాద్రి, వెలుగు: రాజకీయాల్లో కింగ్​లు ఎంత ముఖ్యమో..  కింగ్​మేకర్లు అంతే ముఖ్యమని మంత్రి సీతక్క అన్నారు.  టికెట్​వచ్చిన వాళ్లు కింగ్​లు అయితే.. వారిని గెలిపించడానికి పనిచేసేవారు కింగ్​ మేకర్లని తెలిపారు.  మున్సిపల్ ఎన్నికలపై యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల మీటింగ్​లో ఆమె మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. టికెట్​ఎవరికి వచ్చినా అందరూ సమన్వయంతో పని చేస్తే మున్సిపల్​ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామన్నారు.

గెలుపుపై అతి విశ్వాసం వద్దని, ప్రణాళికాబద్దంగా ప్రతి ఓటరును కలవాలని సూచించారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్​ను ప్రజలకు వివరించాలని సూచించారు. పోటీ చేసే అవకాశం రాని వారిని పార్టీ గుర్తు పెట్టుకుంటుందని, నామినేటేడ్​ పదవుల భర్తీ విషయంలో స్థానం కల్పిస్తామని చెప్పారు. సొసైటీలో లేకుండా కేవలం సోషల్​ మీడియాలో ఉంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్‌‌ఎస్‌ను తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి, భువనగిరి, తుంగతుర్తి ఎమ్మెల్యేలు కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, మందుల సామెల్ ఉన్నారు.