Adani News: భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గడచిన రెండు మూడేళ్లుగా వివిధ సందర్భాల్లో ఆయనపై అలాగే ఆయన వ్యాపార సంస్థలపై వచ్చిన ఆరోపణలు ఇప్పటి వరకు రుజువు కానప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా 2026లో ఈ దూకుడు మరో కొత్త స్థాయికి చేరుకోబోతోందని తాజా పరిస్థితులను చూస్తే తెలుస్తోంది. దీంతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లు ఇవాళ ఇంట్రాడేలో ప్రభావితం అవుతున్నాయి. హిండెన్‌బర్గ్ ఘటన తర్వాత తాజాగా అదానీ విషయంలో అమెరికా దూకుడు దాని ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందా...
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని టార్గెట్ చేసుకుని అమెరికా దర్యాప్తు సంస్థలు తమ వేగాన్ని పెంచాయి. తాజాగా సమాచారం ప్రకారం.. భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందకపోవడంతో అమెరికా రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(SEC), భారత ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా అదానీకి సమన్లు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా కోర్టు అనుమతి కోరుతూ SEC దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది.
ప్రభుత్వంతో సంబంధం లేకుండా..
సుమారు 265 మిలియన్ డాలర్ల లంచం, మోసానికి సంబంధించిన ఆరోపణల కేసులో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలకు చట్టబద్ధమైన సమన్లు పంపాలని SEC భావిస్తోంది. సాధారణంగా అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఒక దేశంలోని వ్యక్తికి మరో దేశం సమన్లు పంపాలంటే ఆ దేశ ప్రభుత్వం ద్వారానే ఆ ప్రక్రియ జరగాలి. కానీ అదానీ విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటివరకు అమెరికా చేసిన రెండు అభ్యర్థనలను తిరస్కరించింది. రూల్స్ ప్రకారం సంతకాలు, ముద్రలు లేవని సాంకేతిక కారణాలతో భారత్ వీటిని వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. దీంతో విసిగిపోయిన అమెరికా అధికారులు.. ఇకపై భారత న్యాయశాఖతో సంబంధం లేకుండా నేరుగా అదానీ వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్‌కు సమన్లు పంపేందుకు కోర్టు అనుమతి కోరటం చర్చనీయాంశంగా మారింది.
భారత ప్రభుత్వం తీరుపై అమెరికా అసహనం..
హేగ్ కన్వెన్షన్ వంటి అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం సమన్లకు కొన్ని నిబంధనలు వర్తించవని.. అయినా భారత్ కావాలనే జాప్యం చేస్తోందని SEC తన పిటిషన్‌లో పేర్కొంది. డిసెంబరులో రెండో సారి సమన్ల తిరస్కరణ సమయంలో.. అసలు సమన్లు పంపమని కోరే అధికారం SECకి ఉందా అనే సందేహాన్ని కూడా భారత న్యాయశాఖ వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారిక మార్గాల ద్వారా సమన్లు పంపడం అసాధ్యమని భావిస్తున్న అమెరికా.. డిజిటల్ పద్ధతిలో నేరుగా అదానీని టార్గెట్ చేస్తోంది. అయితే అదానీ గ్రూప్ మాత్రం దీనిపై న్యాయపోరాటానికి సిద్ధం అనే సంకేతాలు ఇస్తోంది.
అదానీ షేర్లలో భారీ నష్టాలు..
తాజా పరిణామాల మధ్య భారత స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ అదానీ గ్రూప్ స్టాక్స్ ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి. అమెరికా అధికారులు అదానీని నేరుగా టార్గెట్ చేస్తున్నారనే వార్తలు బయటకు రావడంతో.. శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్‌కు చెందిన లిస్టెడ్ స్టాక్స్ భారీగా కుప్పకూలాయి. ప్రధానంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు దాదాపు 3% నుంచి 6% వరకు నష్టపోయాయి. ఇన్వెస్టర్లు ఆందోళనతో భారీగా అమ్మకాలకు పాల్పడటంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ లక్షల కోట్ల మేర ఆవిరైంది. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత మళ్లీ అదే స్థాయిలో అదానీ స్టాక్స్ ఒత్తిడికి గురవ్వడం ప్రస్తుతం దేశీయ ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది.
