ఐటీ రంగంలో 'ఏఐ' తుఫాన్: హైరింగ్ రూల్స్ మార్చేస్తున్న కంపెనీలు.. ఇకపై అలా కుదరదంట

ఐటీ రంగంలో 'ఏఐ' తుఫాన్: హైరింగ్ రూల్స్ మార్చేస్తున్న కంపెనీలు.. ఇకపై అలా కుదరదంట

భారతీయ ఐటీ రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న హైరింగ్ సాంప్రదాయాలు ప్రస్తుతం వేగంగా మారిపోతున్నాయి. గతంలో కొత్త ప్రాజెక్టులు వస్తే.. మరిన్ని ఎక్కువ మందిని నియమించుకోవాలనే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు ఏఐ ఎఫెక్ట్ వల్ల ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతున్నా.. ఉద్యోగుల సంఖ్య మాత్రం అదే స్థాయిలో పెంచటం లేదు ఐటీ సంస్థలు. 2026 నాటికి ఐటీ సంస్థలు తమ పనితీరును పూర్తిగా ఏఐ బేస్డ్ కిందకు మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో కంపెనీల వృద్ధిని వారి వద్ద ఉన్న ఉద్యోగుల సంఖ్యను బట్టి అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు తారుమారౌతున్నాయి.

కొత్త హైరింగ్స్ లేవమ్మా..

ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటివి కూడా కొత్త వారిని తీసుకోవడం కంటే.. ఉన్న వారికే ఏఐతో రీస్కిల్లింగ్ పై దృష్టి సారిస్తున్నాయి. టీసీఎస్ తన వర్క్‌ఫోర్స్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా సుమారు 1,800 మందిని తొలగించింది. అంతర్గతంగా ఇతర విభాగాల్లోకి సర్దుబాటు చేయలేని పక్షంలోనే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. టెక్ మహీంద్రా వంటి సంస్థలు కూడా కొత్త నియామకాల కంటే ఉన్న ఉద్యోగులను మార్చుకుంటూ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల డీల్స్ సంఖ్య పెరుగుతున్నా.. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో మాత్రం పెరుగుదల కనిపించడం లేదు.

ALSO READ : వచ్చే వారం 16వేల మందిని లేఆఫ్ చేస్తున్న అమెజాన్..

గుంపులు గుంపులు హైరింగ్ ఓవర్..

ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగం పొందే ఫ్రెషర్లపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. 2023 నుంచి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కలిపి 50 వేల లోపు ఫ్రెషర్ ఉద్యోగాలు మాత్రమే అందుబాటులో ఉండగా.. అందులో ఐటీ వాటా మూడో వంతు కంటే తక్కువగానే ఉంది. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఫ్రెషర్ నియామకాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. బల్క్ హైరింగ్ స్థానంలో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డేటా అనలిటిక్స్ వంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తున్నాయి ఇండియన్ టెక్ సంస్థలు.

ALSO READ : జాబ్స్, ఎగుమతులపై ఫోకస్ ఉండాలి..

హై శాలరీలతో కొత్త ఉద్యోగులు వద్దంటూ..

ఐటీ సేవల డెలివరీ మోడల్‌లో వస్తున్న మార్పు ఈ పరిస్థితికి మరో ప్రధాన కారణం. సాఫ్ట్‌వేర్ ఏజెంట్లు, ఏఐ టూల్స్ సహాయంతో తక్కువ మందితోనే ఎక్కువ పనిని క్వాలిటీగా పూర్తి చేయవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. దీనివల్ల కంపెనీలు తమ నిర్వహణ వ్యయం తగ్గించుకుని లాభాలు పెంచుకునే పనిలో పడ్డాయి. ప్రస్తుతం టీసీఎస్ తన మొత్తం ఉద్యోగుల్లో 2 లక్షల మందికి పైగా ఏఐ శిక్షణ ఇచ్చింది. బయట నుంచి నిపుణులను భారీ ఫ్యాకేజీలకు తీసుకోవడం కంటే.. సంస్థలో పనిచేస్తున్న టాలెంట్‌ను మెరుగుపరచుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ మార్పు ఐటీ రంగంలో కేవలం పని చేసే విధానాన్ని మాత్రమే కాకుండా.. భవిష్యత్ జాబ్ మార్కెట్ రూపు రేఖలను, హైరింగ్ ట్రెండ్స్ మార్పులను ఇవి సూచిస్తున్నాయి.