జాబ్స్, ఎగుమతులపై ఫోకస్ ఉండాలి..బడ్జెట్పై సర్వేలో పారిశ్రామికవేత్తల వెల్లడి

జాబ్స్, ఎగుమతులపై ఫోకస్ ఉండాలి..బడ్జెట్పై సర్వేలో పారిశ్రామికవేత్తల వెల్లడి
  • ఇన్​ఫ్రా సెక్టార్​కు పెద్దపీట వేయాలి
  • బడ్జెట్​పై సర్వేలో పారిశ్రామికవేత్తల వెల్లడి

న్యూఢిల్లీ: ఈసారి కేంద్ర బడ్జెట్ ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాల పెంపు, ఎగుమతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భారత పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన సర్వేలో పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఆర్థికవృద్ధిపై మెజారిటీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.  తయారీ రంగం, రక్షణ రంగం, ఎంఎస్ఎంఈ రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలోనూ ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకుంటుందని 42 శాతం మంది అన్నారు.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు లక్ష్యం 4.4 శాతాన్ని సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2025 డిసెంబర్ చివరి నుంచి 2026 జనవరి మధ్యలో సుమారు 100 కంపెనీల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ నివేదికను రూపొందించారు. 2026-–27 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7 నుంచి 8 శాతం మధ్య ఉంటుందని సగం మంది అంచనా వేశారు. అంతర్జాతీయంగా వాణిజ్య ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో ఎగుమతులకు బడ్జెట్ నుంచి గట్టి మద్దతు లభిస్తుందని నమ్ముతున్నామని పేర్కొన్నారు. 

ఎగుమతులకు ఊతమివ్వాలి

భారత్ ఎగుమతుల పనితీరును మెరుగుపరచడానికి కస్టమ్స్ ప్రక్రియలను సరళీకరించాలని  అన్నారు.   రవాణా అడ్డంకులను తొలగించి ఎగుమతి ప్రోత్సాహకాలు, రీఫండ్ విధానాలను బలోపేతం చేయాలని కోరారు. ఎగుమతిదారుల పోటీతత్వాన్ని పెంచడానికి నిధులు పెంచాలని సూచించారు. వీటితో పాటు సెజ్ పాలసీలో సంస్కరణలు, కస్టమ్స్ టారిఫ్‌‌ల హేతుబద్ధీకరణ అవసరమని రెస్పాండెంట్లు అభిప్రాయపడ్డారు.  పన్నుల చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు.