3 ఏళ్లలో బీజేపీ నేతలు..   1.5 లక్షల కోట్లు కొల్లగొట్టారు : ప్రియాంక గాంధీ

3 ఏళ్లలో బీజేపీ నేతలు..   1.5 లక్షల కోట్లు కొల్లగొట్టారు : ప్రియాంక గాంధీ
  • కర్నాటకలో మీ ప్రభుత్వ దోపిడీపై మౌనం ఎందుకు?
  • ఎన్నికల ప్రచారంలో మోడీకి ప్రియాంక గాంధీ ప్రశ్న

బెంగళూరు: కర్నాటకలో  బీజేపీ సర్కార్ వసూలు చేస్తున్న 40% కమీషన్ పై, ఇతర దోపిడిలపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నిక‌‌ల ప్రచారంలో  భాగంగా ఆమె బుధవారం విజయపుర జిల్లాలో జరిగిన బ‌‌హిరంగ స‌‌భ‌‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, బీజేపీపై ప్రియాంక తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్నాటకలో అధికారంలో ఉన్న మోడీ.. ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన కలగా చెబుతున్నారని విమర్శించారు.

"ప్రపంచమంతా మోడీని సర్వశక్తిమంతుడు, సుప్రీం, గొప్పవాడు, వికాస్ పురుష్ అని పిలుస్తుంది. మరి అంత సర్వజ్ఞాని అయిన మోడీ తన కలను ఇంకా ఎందుకు నెరవేర్చుకోలేక పోయారు.? "   అని ప్రియంక ఎద్దేవా చేశారు. బీజేపీ సర్కారు.. 40% కమీషన్ గవర్నమెంట్‌‌గా మారి ప్రజలను దోచుకుంటున్నప్పుడు ప్రధాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కండ్లు మూసుకుని కలలు కనడంలో బిజీగా ఉన్నందునే కర్నాటకలో జరుగుతున్న దోపిడిని మోడీ చూడలేకపోయారా అని మండిపడ్డారు. కర్నాటకలో కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకుంటున్నారని తాను ప్రధానికి ఎన్నిసార్లు లెటర్లు రాసిన సమాధానం రాలేదని ఆమె ఆరోపించారు. రైతు ఆత్మహత్యల విషయంలోనూ ప్రధాని మౌనంగా  ఉన్నారని విమర్శించారు. 

3.5 ఏళ్లలో బీజేపీ నేతలు..   1.5 లక్షల కోట్లు కొల్లగొట్టారు

బీజేపీ దోపిడీ వల్ల రాష్ట్రంలో పాలన, ఉపాధి అంశాలు మరుగున పడ్డాయని..ఇప్పుడు ఎన్నికలు రాగానే సంబంధంలేని అంశాలను లేవనెత్తుతున్నారని ప్రియాంక ఫైర్ అయ్యారు. కర్నాటకలో 3.5 ఏళ్లలో బీజేపీ 1.5 లక్షల కోట్లు కొల్లగొట్టిందని ఆమె ఆరోపించారు. ఆ డబ్బుతో 100 ఎయిమ్స్ ఆసుపత్రులు, 2,250 కి.మీ పొడవైన ఆరు లేన్‌‌ల రోడ్లు, 187 ఈఎస్‌‌ఐ హాస్పిటల్స్, 30,000 స్మార్ట్ క్లాస్‌‌రూమ్‌‌లను కట్టొచ్చని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, ఆసుపత్రులు, పాఠశాలలు, రోడ్ల నిర్మాణం, ఉపాధి, ధరల పెరుగుదల నుంచి పేదలను ఉపశమనం కలిగించడం, రైతుల ప్రయోజనాలను ప్రోత్సహించడం వంటి అంశాలు వెనుకబడి ఉన్నాయని తెలిపారు. బెంగళూరులో రోడ్లపై పడిన గుంతల వల్ల ప్రమాదాలు జరిగి 35 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రియాంక ఆరోపించారు.  ఈ లోపాలను కప్పిపుచుకోవడానికి నేడు బీజేపీ నేతలు ప్రజలకు సంబంధం లేని అంశాలను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు.