‘మునుగోడు సమర భేరి సభ’కు బీజేపీ విస్తృత ఏర్పాట్లు

 ‘మునుగోడు సమర భేరి సభ’కు బీజేపీ విస్తృత ఏర్పాట్లు
  • చీఫ్​ గెస్ట్​గా అమిత్ షా పార్టీలో చేరనున్న రాజగోపాల్ రెడ్డి
  • టీఆర్ఎస్ సభకు మించి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: ‘మునుగోడు సమర భేరి సభ’కు బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం జరగనున్న ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా చీఫ్​ గెస్ట్​గా హాజరవుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్​ టాపిక్​గా మారింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే వేదికపై నుంచి బీజేపీలో చేరనుండటంతో ఈ సభకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. టీఆర్ఎస్ సభకు మించి జనాన్ని తరలించి మునుగోడు ప్రజలు తమ వైపే ఉన్నారనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది. అందుకే సభను సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ముఖ్య నేతలంతా మూడ్రోజులుగా మునుగోడులోనే మకాం వేసి ప్రతి పల్లెను టచ్ చేస్తూ సభకు జనాన్ని తరలించడంపై ఫోకస్ పెట్టారు.

మునుగోడులోనే మకాం వేసి..

మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఈ సభ ఏర్పాట్లకు ఇన్​చార్జిగా ఉన్నారు. ఆయన మూడ్రోజులుగా మునుగోడులోనే ఉంటూ.. సభా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అమిత్ షా వస్తుండడంతో భద్రతాపరమైన ఏర్పాట్లపై నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, అధికారులు.. వివేక్​తో కలిసి చర్చించారు.  

లక్ష మందితో సభ

సుమారు లక్ష మంది వరకు జనం తరలివస్తారని బీజేపీ అంచనా వేస్తున్నది. అందుకు తగిన ఏర్పాట్లలో  ఉంది. ప్రధాన సభా వేదికపై అమిత్ షాతో పాటు జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు ఉంటారు. ఈ వేదికకు కుడి, ఎడమ వైపున మరో రెండు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక వేదికపై రాష్ట్ర ఆఫీసు బేరర్లు, నల్గొండ ముఖ్య నేతలు, ఇంకో వేదికపై సాంస్కృతిక బృందాల కళా ప్రదర్శనలు ఉంటాయి. వర్షం వచ్చినా అంతరాయం కల్గకుండా జర్మన్ టెక్నాలజీ  టెంట్లు వేస్తున్నారు.

దళిత కార్యకర్త ఇంట్లో భోజనం

అమిత్‌ షా హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత లాల్‌దర్వాజ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం నగరంలోనే  దళిత కార్యకర్త ఇంట్లో భోజనం చేస్తారు. బేగంపేట ఎయిర్‌ పోర్టు సమీపంలోని మనోహర హోటల్‌లో మునుగోడు రైతులతో సమావేశమవుతారు. 

సభకు భారీ బందోబస్తు

ఐజీ కమల హాసన్​ రెడ్డి ఆధ్వర్యంలో 1,296 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అందులో ఐదుగురు ఎస్పీలు, 23మంది  డీఎస్పీలు, 94మంది ఎస్​ఐలు, 50 మంది సీఐలు, 198 మంది హెడ్ కానిస్టేబుల్స్​, 800 మంది కానిస్టేబుల్స్​తో పాటు 8 స్పెషల్ పార్టీ బృందాలు, 4 ఏపీఎస్పీ బృందాలు బందోబస్తులో పాల్గొంటాయి. హైదరాబాద్​ నుంచి అమిత్ షా హెలికాప్టర్ ద్వారా మునుగోడులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్​కు​ చేరుకొని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభాస్థలికి వెళ్తారు. 

కేసీఆర్​వి మోసపూరిత హామీలు: తరుణ్ చుగ్

కేసీఆర్ కుటుంబ పాలనను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరు సంకల్పం తీసుకునే సభ ఇది అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్​ చుగ్ అన్నారు. కేసీఆర్ మోసపూరిత హామీలతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఆయన శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. 

అమిత్​ షా షెడ్యూల్

ఆదివారం మధ్యాహ్నం 3. 40 గంటలకు బేగంపేట​ఎయిర్ పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సాయంత్రం 4.35 గంటలకు మునుగోడు వెళ్తారు. 4.50 గంటల వరకు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 4.50 నుంచి 6 గంటల దాకా సమర భేరి సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 6. 45కు రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారు. 7.30 వరకు అక్కడే రామోజీరావుతో సమావేశమవుతారు. రాత్రి 8 గంటలకు శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. రాత్రి 9.30 గంటల వరకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమవుతారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు దిశా నిర్దేశం చేస్తారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, చేరికలు, సంజయ్ పాదయాత్ర గురించి అడిగి తెలుసుకుంటారు.