రామరాజ్యం స్ఫూర్తిగానే ‘జీ రామ్ జీ’ పేరు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రామరాజ్యం స్ఫూర్తిగానే ‘జీ రామ్ జీ’ పేరు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రామరాజ్యం, గ్రామ స్వరాజ్యమే స్ఫూర్తిగా కేంద్రం ప్రభుత్వం ఉపాధి హామీ కొత్త చట్టానికి ‘జీ రామ్ జీ’ అని పేరును పెట్టిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అవినీతి, అక్రమాలను అరికట్టడంలో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. రాష్ట్రాలు ఆర్నెళ్లలోపు ఈ చట్టాన్ని అమలు చేయాలని సూచిందని చెప్పారు. గతంలో కేంద్రం 90 శాతం నిధులు ఇచ్చేదని, 10 శాతం రాష్ట్రాలు భరించేవన్నారు. 

ఇప్పుడు రాష్ట్రాలపై30 శాతం భారం పడుతుందన్నారు. రైతులు, కూలీల కోసం రాష్ట ప్రభుత్వం ఈ మాత్రం భరించకుంటే ఎలా? అని ప్రశ్నించారు. మొత్తం కేంద్రమే భరించాలనడం సరికాదన్నారు. పథకంలో పని దినాలను కేంద్రం 125 రోజులకు పెంచిందన్నారు. ఈ స్కీమ్​ద్వారా 62 శాతం మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. అధికారంలోకి వస్తే రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి.. కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.  

మోదీ మైండ్ కరాబైంది: కూనంనేని 

దేశంలోనే గొప్ప చట్టం ఉపాధి హామీ అని, దాన్ని నిర్వీర్యం చేయాలనుకోవడం దుర్మార్గమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రాముడు గుడిలో ఉండాలని, మహాత్ముడు మనుషుల్లో ఉండాలన్నారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును ఎందుకు మార్చాలనుకుంటున్నారో కేంద్రం చెప్పాలన్నారు.  ప్రధాని మోదీకి మైండ్ కరాబ్ అయిందని, ఆయనకు టెస్టులు చేయించాలని కామెంట్ చేశారు. 

దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కూనంనేని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ కలగజేసుకుని ఆ వ్యాఖ్యలను పరిశీలిస్తామని, అభ్యంతరం ఉంటే తొలగిస్తామనడంతో వారు శాంతించారు. అనంతరం కూనంనేని మళ్లీ మాట్లాడుతూ..  మోదీ మైండ్ సెట్​ మారాలని తాను అన్నానని, పార్లమెంటరీ భాషలోనే మాట్లాడానని చెప్పారు.