కేసీఆర్​ పాలనలో పైరవీకారులకే పెద్దపీట

కేసీఆర్​ పాలనలో పైరవీకారులకే పెద్దపీట

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో నేడు జర్నలిస్టులకు సొంత పత్రికల్లో కూడా వాస్తవాలను రాసే స్వేచ్ఛ లేదని, యూట్యూబ్ లోనూ వాస్తవాలను బయటపెట్టలేని దుస్థితి ఉందని మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. జర్నలిస్టులను అణచివేస్తూ, బెదిరిస్తూ అదుపులో పెట్టుకున్నామని కొందరు అనుకుంటున్నారని, కానీ ఈ అణచివేతే రేపటి పతనానికి సంకేతం అవుతుందన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుబ్ బాబా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈటలను జర్నలిస్టులు, చిన్న పత్రికలు, మైనార్టీ సంఘాల జేఏసీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తాము వెళ్లలేని చోటుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు.

సొంత రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోరుకున్నామని, కానీ నేటి పాలనలో అవన్నీ కలలుగానే మిగిలాయన్నారు. ‘‘రాష్ట్రం కోసం పోరాడినవాళ్లను పక్కనపెట్టి, పైరవీకారులకు పెద్దపీట వేశారు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే.. అయిన వాళ్లకు ఆకుల్లో.. కాని వాళ్లకు కంచంలో పెట్టాడు” అని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, చట్టాల ఉల్లంఘన, మద్యం ఏరులై పారడం లాంటి విషయాలు మీడియా ద్వారానే ప్రపంచానికి తెలిసిందన్నారు. హుజూరాబాద్ ప్రజలు అమ్ముడుపోలేదని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని చెప్పారు. ‘‘ధర్మం డబ్బుతో నడవదురా’’ అని చెంపపై కొట్టారని కామెంట్ చేశారు. ప్రజలు తనపై పెట్టిన బాధ్యతను మరువనని, వారికోసం రాజీలేకుండా పోరాడతానన్నారు. చిన్న పత్రికల సమస్యలపై పోరాడేందుకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. సమావేశంలో జర్నలిస్టు సంఘాల నేతలు సురేందర్, నసీరుద్దీన్ ఖాద్రి, సూర్యారావు, దయానంద్, కప్పర సాద్  పాల్గొన్నారు.