కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం

కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంగళవారం (జనవరి 6) నోటీఫికేషన్ జారీ చేశారు. కవిత రాజీనామాతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. కాగా, బీఆర్ఎస్ నుంచి సస్పెండైన తర్వాత ఆ పార్టీ ద్వారా లభించిన పదవి తనకు వద్దంటూ ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్‎లో రాజీనామా చేసిన కవిత.. మండలి ఛైర్మన్‎కు రిజైన్ లెటర్‎ను పంపించి ఆమోదం తెలపాలని కోరారు. 

రాజీనామాపై పునరాలోచించుకోవాలని మండలి చైర్మన్ కవితకు సూచించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని కవిత.. 2026, జనవరి 5న మండలి వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి చైర్మన్‎కు విజ్ఞప్తి చేశారు. అన్ని ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో కవిత రాజీనామాకు మంగళవారం (జనవరి 6) చైర్మన్ గుత్తా ఆమోదం తెలిపారు. 

కాగా, బీఆర్ఎస్ పార్టీ తరుఫున నిజామాబాద్ లోకల్ బాడీ నియోజకవర్గం నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే.. పార్టీ లైన్ క్రాస్ చేసిందన్న ఆరోపణలపై బీఆర్ఎస్ కవితను సస్పెండ్ చేసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన పదవి తనకు అవసరం లేదని కవిత ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు.  

►ALSO READ | తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 13 బిల్లులకు సభ ఆమోదం